Telugu Global
National

DMK నాయకుడిపై తమిళనాడు గవర్నర్ పరువు నష్టం దావా

''డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద్రావిడ నాయకుల పేర్లను ఉచ్చరించడం ఇష్టం లేకపోతే, ప్రభుత్వం చేసిన ప్రసంగాన్ని చదవడం ఇష్టంలేక‌పోతే, మీరు కాశ్మీర్‌కు వెళ్లండి, మేము ఉగ్రవాదులను పంపుతాము, వారు మిమ్మల్ని కాల్చివేస్తారు” అని DMK నాయకుడు శివాజీ అన్నారు.

DMK నాయకుడిపై తమిళనాడు గవర్నర్ పరువు నష్టం దావా
X

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రముఖ నాయకుడు శివాజీ కృష్ణమూర్తిపై తమిళనాడు రాజ్ భవన్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. జనవరి 19, గురువారం చెన్నైలోని సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, శివాజీ ప్రసంగం "తప్పుడు ఆరోపణలతో, గవర్నర్ ప్రతిష్టను కించపరిచేలా, ఉద్దేశపూర్వకంగా చేయబడింది" అని గవర్నర్ కార్యాలయం ఆరోపించింది. “ఆరోపణలలో నిజం లేదు. ఈ ప్రసంగం నేరుగా తమిళనాడు గౌరవనీయ గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది.'' అని పిటిషన్ పేర్కొంది.

గవ్ర్నర్ రవి తమిళనాడు అసె‍బ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసిన ప్రసంగం చదవకుండా కొన్ని భాగాలను పక్కన పెట్టి, తనకిష్ట‌మైన ప్రసంగం చేశార‌ని డీఎంకే నాయకుడు శివాజీ తన ప్రసంగంలో ఆరోపించారు. ''డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద్రావిడ నాయకుల పేర్లను ఉచ్చరించడం ఇష్టం లేకపోతే, ప్రభుత్వం చేసిన ప్రసంగాన్ని చదవడం ఇష్టంలేక‌పోతే, మీరు కాశ్మీర్‌కు వెళ్లండి, మేము ఉగ్రవాదులను పంపుతాము, వారు మిమ్మల్ని కాల్చివేస్తారు” అని శివాజీ అన్నారు.

"అసెంబ్లీలో తన ప్రసంగంలో అంబేద్కర్ పేరును ఉచ్చరించడానికి గవర్నర్ నిరాకరిస్తే, ఆయనను విమర్శించే హక్కు నాకు లేదా?" అని ప్రశ్నించారు శివాజీ. గవర్నర్ రవిపై మరికొన్ని అవమానకర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలైపై కూడా శివాజీ వ్యాఖ్యలు చేశారు. డిఎంకెలో వంశపారంపర్య రాజకీయాల ఆరోపణలపై అభ్యంతరకరమైన పదజాలంతో స్పందించారు.

కాగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 499 (పరువు నష్టం), 500 (పరువునష్టానికి శిక్ష) కింద కృష్ణమూర్తి ప్రాసిక్యూషన్‌కు బాధ్యుడని రాజ్‌భవన్‌ పిటిషన్‌ పేర్కొంది. అంతకుముందు, గవర్నర్ రవికి వ్యతిరేకంగా శివాజీ చేసిన ప్రసంగంపై చర్య తీసుకోవాలని కోరుతూ రాజ్ భవన్, బిజెపి రాష్ట్ర విభాగం కూడా వేర్వేరు ఫిర్యాదులతో పోలీసులను ఆశ్రయించాయి. చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

మరో వైపు ఈ వివాదం నేపథ్యంలో శివాజీని డీఎంకే అన్ని పదవుల నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు, పార్టీకి చెడ్డపేరు తెచ్చినందుకు శివాజీని సస్పెండ్ చేసినట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురైమురుగన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే గవర్నర్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను అధికార పక్షం ప్రస్తావించలేదు.

First Published:  20 Jan 2023 2:09 AM GMT
Next Story