Telugu Global
National

విజయ్ సినిమా ఐదో ఆటకు పర్మిషన్

ఈనెల 19వ తేదీన విజయ్ హీరోగా నటించిన లియో సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు కూడా ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతించలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

విజయ్ సినిమా ఐదో ఆటకు పర్మిషన్
X

ఇళయ దళపతి విజయ్ అభిమానులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా నటించిన లియో సినిమా ఐదో ఆట ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి అగ్ర హీరోలు నటించిన సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.

అయితే బెనిఫిట్ షోలకు ఆయా హీరోల అభిమానులు భారీగా తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా కటౌట్లు, బ్యానర్లు క‌ట్ట‌డం, టపాసులు పేల్చి హంగామా వంటివి చేస్తుంటారు. ఆ సమయంలో థియేటర్ల వద్ద భారీగా రద్దీ ఉంటుంది. బెనిఫిట్ షోల సందర్భంగా ఒక్కోసారి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. కటౌట్లు కట్టే సందర్భంలో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.

ఈ ఏడాది సంక్రాంతి పండగ సమయంలో హీరో అజిత్ నటించిన తునివు విడుదల సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించిన బెనిఫిట్ షోలో ఓ థియేటర్ వద్ద అభిమానుల మధ్య గొడవ జరిగి ఓ అభిమాని మృతి చెందాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రంలో బెనిఫిట్ షోల ప్రదర్శనను రద్దు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళనాడులో అగ్ర హీరోల సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు ప్రదర్శించడంలేదు.

ఈనెల 19వ తేదీన విజయ్ హీరోగా నటించిన లియో సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు కూడా ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతించలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. త్వరలో విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతోనే కావాలనే ఆయన సినిమాకు బెనిఫిట్ షోల ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. లియో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని ఈ సినిమాను నిర్మించిన సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం లియో ఐదో ఆటకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఐదో ఆట ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలను తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కాకుండా ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. విజయ్ సినిమాకు ఐదో ఆట ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించడంతో విజ‌య్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  11 Oct 2023 1:49 PM GMT
Next Story