Telugu Global
National

జ‌నం గ‌మ‌నిస్తున్నారు.. బీజేపీకి గుణ‌పాఠం చెబుతారు.. - ఈడీ దాడుల‌పై సీఎం స్టాలిన్‌

దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినప్పటికీ సెక్రటేరియట్‌లోని మంత్రి కార్యాలయంలో సోదాలు చేయాల్సిన అవసరం ఏముందని ఈ సంద‌ర్భంగా స్టాలిన్ ప్ర‌శ్నించారు.

జ‌నం గ‌మ‌నిస్తున్నారు.. బీజేపీకి గుణ‌పాఠం చెబుతారు.. - ఈడీ దాడుల‌పై సీఎం స్టాలిన్‌
X

ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను అడ్డంపెట్టుకొని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై కేంద్రం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఆరోపించారు. ప్ర‌త్య‌ర్థుల‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేకే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని విమ‌ర్శించారు. తమిళనాడు రాష్ట్ర విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కార్యాలయంతో పాటు, సెక్రటేరియ‌ట్‌లోని ఆయన కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేంద్రం బెదిరింపులకు తాము భయపడేది లేదని, అధికారం కోల్పోతామనే భయంతోనే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని స్టాలిన్ చెప్పారు. బీజేపీ చేస్తున్న అసంబ‌ద్ధ చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వారే ఆ పార్టీకి త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని తెలిపారు.

దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినప్పటికీ సెక్రటేరియట్‌లోని మంత్రి కార్యాలయంలో సోదాలు చేయాల్సిన అవసరం ఏముందని ఈ సంద‌ర్భంగా స్టాలిన్ ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యేన‌ని చెప్పారు. ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ‌ అని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం తమిళనాడులో పర్యటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కార్యాలయంపై ఈడీ దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

First Published:  14 Jun 2023 2:12 AM GMT
Next Story