Telugu Global
National

ఇది 'ఇండియా'.. 'హిండియా' కాదు..

హిందీతోపాటు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లోని 22 భాషలను అధికార భాషలుగా పరిగణించాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని 'హిండియా' చేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.

ఇది ఇండియా.. హిండియా కాదు..
X

హిందీ భాషను ఇతర రాష్ట్రాలపై రుద్దాలనుకోవడం సరికాదంటూ మరోసారి ఘాటుగా హెచ్చరించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇది ఇండియా, హిండియా కాదంటూ అమిత్ షా కి చురకలంటించారు. దేశ సంస్కృతి, చరిత్రను బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 14 ను 'హిందీ దివస్'గా కాకుండా 'భారతీయ భాషల దినోత్సవం'గా పాటించాలని ఆయన కోరారు. కేంద్ర హోం మంత్రికి స్థానిక భాషలపై శ్రద్ధ ఉంటే.. హిందీతో సమానంగా అన్ని భాషలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్రం దుస్సాహసం చేస్తోందని విమర్శించారు స్టాలిన్.

ఆ భాషలను చంపేసింది ఎవరు..?

తమిళంతో సహా భారతీయ భాషలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే హిందీని 'జాతీయ భాష'గా చూపేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు స్టాలిన్. ఉత్తర భారతదేశంలోని మైథిలీ, భోజ్ పురి భాషలు హిందీ కారణంగా అంతరించి పోతున్నాయని చెప్పారు. భారతదేశం సంస్కృతి, చరిత్రను అర్థం చేసుకోవడానికి హిందీ నేర్చుకోవాలని చెప్పడం.. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ విధానానికి విరుద్ధం అని అన్నారు స్టాలిన్.

సూరత్‌ లో జరిగిన అఖిల భారత అధికార భాషా సదస్సులో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హిందీ దివస్ సందర్భంగా చేసిన ప్రకటన కలకలం రేపింది. హిందీ ఇతర భాషలకు పోటీ కాదు అని చెప్పారు అమిత్ షా. హిందీ అన్ని భాషలకు మిత్రుడని, హిందీని గుజరాతీ, తమిళం, మరాఠీ భాషలకు పోటీ అనుకోవడం తప్పు అని అన్నారు. హిందీ అధికార భాషగా మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలలో తమిళం ప్రస్తావన కూడా తీసుకు రావడంతో స్టాలిన్ ఘాటుగా స్పందించారు.

హిందీతోపాటు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లోని 22 భాషలను అధికార భాషలుగా పరిగణించాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని 'హిండియా' చేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు స్టాలిన్.

First Published:  15 Sep 2022 11:14 AM GMT
Next Story