Telugu Global
National

కోర్టులు వద్దంటున్నా తగ్గేదే లేదంటున్న స్టాలిన్

ఆన్‌లైన్ గేమింగ్‌‌ నిషేధిస్తూ.. తమిళనాడు కేబినెట్ సోమవారం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుంది.

కోర్టులు వద్దంటున్నా తగ్గేదే లేదంటున్న స్టాలిన్
X

ఆన్‌లైన్ జూదం వల్ల ఎన్ని కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. పేకాట, మద్యపానం వంటి వ్యసనాలు ఉంటే కచ్చితంగా కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశముంది, తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశమూ ఉంటుంది. కానీ ఆన్‌లైన్ జూదం గురించి మాత్రం ఇంట్లోవాళ్లకి తెలిసేలోపే తప్పు జరిగిపోతోంది. కుటుంబ యజమానులు అప్పులపాలై చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే టిక్ టాక్‌ని బ్యాన్ చేసినట్టు ఈ ఆన్‌లైన్ గేమ్‌లపై నిషేధం విధించడం మాత్రం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక వంటి రాష్ట్రాలు ఈ ఆన్‌లైన్ గేమింగ్‌ని నిషేధించాలని కోరుతున్నాయి. అయితే కేరళ, తమిళనాడు, కర్నాటక హైకోర్టులు ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్‌ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నాయి. వీటిని నిషేధిస్తూ విడుదల చేసిన జీవోలను కొట్టేశాయి. ఆన్‌లైన్ రమ్మీ, పేకాట వంటి ఆటలను నిషేధిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం గేమింగ్ అండ్ పోలీస్ యాక్ట్ 2021ని తీసుకొచ్చింది. దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కొత్తగా మరో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్‌‌ నిషేధిస్తూ.. తమిళనాడు కేబినెట్ సోమవారం ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుంది.

ఆన్‌లైన్ గేమింగ్ వలన యువకులు పెద్ద ఎత్తున సంపాదన కోల్పోతున్నారని తమిళనాడు ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఆర్థిక, సామాజిక నష్టాలకు ఈ ఆన్‌లైన్ గేమింగ్ కారణం అవుతోందని తెలిపింది. రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన గేమ్ అయినప్పటికీ.. ఇది తరువాత వ్యసనంగా జూదంగా మారుతోందని పేర్కొంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఇప్పుడు విశేషం.

First Published:  27 Sep 2022 3:06 AM GMT
Next Story