Telugu Global
National

మన కన్నును మనమే పొడుచుకునేట్లుగా ఇప్పటి రాజకీయాలు.. హీరో విజయ్ సెటైర్లు

ఇప్పటి విద్యార్థుల్లో చాలామందికి వచ్చే ఎన్నికలకల్లా ఓటు హక్కు వస్తుందని.. మీరంతా డబ్బు తీసుకొని ఓటు వేయవద్దని సూచించాడు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా ఓటుకు నోటు తీసుకోకుండా చూడాలని కోరాడు.

మన కన్నును మనమే పొడుచుకునేట్లుగా ఇప్పటి రాజకీయాలు.. హీరో విజయ్ సెటైర్లు
X

మన కన్నును మనమే పొడుచుకునేట్లుగా ఇప్పటి రాజకీయాలు సాగుతున్నాయని, డబ్బు తీసుకొని ఓటు వేయడమే దీనికి కారణమని తమిళ అగ్ర హీరో విజయ్ కామెంట్స్ చేశాడు. తమిళనాడులో 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ ప్రోత్సాహక బహుమతులు, అవార్డులు అందజేశాడు. ఈ కార్యక్రమం చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో విజ‌య్‌ మాట్లాడుతూ.. ఇప్పటి రాజకీయాలను విమర్శించారు.

ఒక ఓటుకు వెయ్యి చొప్పున లక్షన్నర మందికి పంపిణీ చేసి రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే.. దాని ముందు ఓ రాజకీయ నాయకుడు ఎంత సంపాదించి ఉంటాడో ఆలోచించుకోవాలని సూచించాడు. విద్యార్థులకు బోధించే పాఠాల్లో ఇటువంటి వాటి గురించిన ప్రస్తావన ఉండదని, దయచేసి ఇటువంటి అంశాలను విద్యార్థులకు పాఠాల రూపంలో చెప్పాలని విజయ్ కోరాడు.

ఇప్పటి విద్యార్థుల్లో చాలామందికి వచ్చే ఎన్నికలకల్లా ఓటు హక్కు వస్తుందని.. మీరంతా డబ్బు తీసుకొని ఓటు వేయవద్దని సూచించాడు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా ఓటుకు నోటు తీసుకోకుండా చూడాలని కోరాడు. మన దగ్గర నుంచి దొంగలించలేనిది చదువు ఒకటేనని.. అందుకే బాగా చదువుకోవాలని విద్యార్థులకు విజయ్ సూచించాడు.

కాగా, కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని తమిళనాట ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే విజయ్ తన సినిమాల్లో రాజకీయాలపై విమర్శలు చేస్తుంటాడు. తమిళనాట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాడని.. అందుకే యువతకు దగ్గర అయ్యేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

First Published:  17 Jun 2023 1:59 PM GMT
Next Story