Telugu Global
National

రైలులో దొంగతనం.. రైల్వేకు ఏంటి సంబంధం..?

సుప్రీంకోర్టు మాత్రం రైల్వేకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దొంగతనం అనేది రైల్వేసేవల లోపం కిందకు రాదని తేల్చింది.

రైలులో దొంగతనం.. రైల్వేకు ఏంటి సంబంధం..?
X

రైలులో దొంగతనం జరిగితే అసలు రైల్వేకి సంబంధం లేదా..? కనీసం రైల్వే నష్టపరిహారం కూడా చెల్లించనక్కర్లేదా..? తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చర్చనీయాంశమవుతున్నాయి. రైలులో దొంగతనం జరిగితే రైల్వేకి అసలు సంబంధం లేదని, దాన్ని సేవాలోపంగా గుర్తించలేమని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. రైలులో జరిగే దొంగతనాలకు రైల్వే శాఖకు ఏమాత్రం బాధ్యత లేదని చెప్పింది.

అసలేం జరిగింది..?

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన సురేందర్‌ భోళా అనే వ్యాపారి 2005లో రైలులో ప్రయాణిస్తూ లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. కాశీ విశ్వనాథ్ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీకి వెళ్తుండగా ఈ దొంగతనం జరిగింది. అతని వద్ద టికెట్ కూడా ఉంది. రైల్వేశాఖ ద్వారా తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ సురేంద్ర ఢిల్లీ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. అతడికి అనుకూలంగా ఫోరం తీర్పునిచ్చింది. రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఆ తీర్పుని సవాల్ చేసినా ఫలితం లేదు. రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు కూడా బాధితుడికి అనుకూలంగా తీర్పులిచ్చాయి. చివరకు కేసు సుప్రీంకోర్టుకి చేరింది.

సుప్రీంకోర్టు మాత్రం రైల్వేకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దొంగతనం అనేది రైల్వేసేవల లోపం కిందకు రాదని తేల్చింది. వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను రద్దు చేసిన సుప్రీంకోర్టు సురేందర్ భోళాకి అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం రైల్వేకి అనుకూలంగా తాజా ఉత్తర్వులిచ్చింది.

First Published:  17 Jun 2023 1:51 AM GMT
Next Story