Telugu Global
National

ఆ బాధ్యత కేంద్రానిదే.. ఉక్రెయిన్ విద్యార్థులకు ఊరట..

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువు కొనసాగించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. కోర్స్ పూర్తి చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివరాలతో ఓ పోర్టల్ ఏర్పాటు చేయాలని చెప్పింది.

ఆ బాధ్యత కేంద్రానిదే.. ఉక్రెయిన్ విద్యార్థులకు ఊరట..
X

ఉక్రెయిన్ విద్యార్థులకు భారత్ లో వైద్య విద్య పూర్తిచేసే అవకాశం కల్పించలేమంటూ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో తిరిగొచ్చిన విద్యార్థుల భవిష్యత్ ఏంటా అనే ఆందోళన మొదలైంది. అయితే సుప్రీంకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులతో ఉక్రెయిన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కాస్త ఊరట లభించినట్టయింది. భారత్ లోని మెడికల్ కాలేజీల్లో తిరిగొచ్చిన విద్యార్థులకు సీట్లు ఇప్పించలేకపోయినా, వారికి ప్రత్యామ్నాయం చూపించే బాధ్యత కేంద్రానిదేనంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్ట్. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 20వేలమంది వైద్య విద్యార్థులకు ఇది సంతోషాన్ని కలిగించే వార్తే.

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులంతా భారత్ లో మిగతా కోర్స్ పూర్తి చేసేందుకు అవకాశమివ్వాలంటూ సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించారు. అయితే ఇండియాలో అడ్మిషన్లు కల్పించడం చట్టపరంగా సాధ్యంకాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ఎగ్జామ్ లో అర్హత సాధించకపోవడం వల్లే వారంతా ఉక్రెయిన్ వెళ్లారని, తిరిగొచ్చినంత మాత్రాన అది అర్హతగా మారదని చెప్పింది కేంద్రం. అయితే సుప్రీం మధ్యేమార్గం చూపించాలని చెప్పింది.

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువు కొనసాగించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సుప్రీంకోర్ట్ కేంద్రానికి సూచించింది. కోర్స్ పూర్తి చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివరాలతో ఓ పోర్టల్ ఏర్పాటు చేయాలని చెప్పింది. విద్యార్థులకు కష్టం లేకుండా కేంద్రమే విదేశాలతో సంప్రదింపులు జరపాలని, వైద్యవిద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ భాష, సిలబస్ కు సరిపోయే విధంగా విద్యార్థులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. విద్యార్థులు చుట్టు పక్క దేశాలను వెతుక్కొవాల్సిన పని లేకుండా కేంద్రమే చర్యలు తీసుకోవాలంది. అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రాం కింద ఇతర దేశాల కళాశాల్లో చేరే విధంగా అవకాశం కల్పించాలని సూచించింది. ఫీజులు, సీట్ల వివరాలు, అందుబాటులో ఉండే విధంగా పోర్టల్ ఏర్పాటు చేసిన విద్యార్థులు కావాల్సిన కాలేజ్ ఎంచుకునేలా బదిలీ ఆప్షన్ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.

యుద్ధం సమయంలో విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చే క్రమంలో బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని ఓ బృహత్తర కార్యక్రమంగా ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మాత్రం వైద్య విద్యార్థుల్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆదేశాలతో వారి వైద్య విద్య విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. విద్యార్థులే నేరుగా విదేశాలకు వెళ్లి కాలేజీలు వెతుక్కునే పని లేకుండా కేంద్రం ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంటుంది. కాలేజీల ఎంపిక, ఫీజుల వివరాలతో పోర్టల్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించి, వారి కోర్స్ పూర్తయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

First Published:  17 Sep 2022 2:23 AM GMT
Next Story