Telugu Global
National

జ్ఞాన‌వాపి మ‌సీదులో స‌ర్వేపై సుప్రీం స్టే

వాద‌న‌ల అనంత‌రం ధ‌ర్మాస‌నం స‌ర్వేపై స్టే విధించింది. జూలై 26 వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి శాస్త్రీయ సర్వే చేపట్టరాదని ఆదేశించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

జ్ఞాన‌వాపి మ‌సీదులో స‌ర్వేపై సుప్రీం స్టే
X

జ్ఞాన‌వాపి మ‌సీదులో శాస్త్రీయ స‌ర్వే వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. జూలై 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు గత వారం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు ఇండియ‌న్ ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన‌ అధికారుల బృందం సోమవారం సర్వే ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో దీనిని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై చీఫ్ జ‌స్టిస్ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. విచార‌ణ‌లో భాగంగా ధ‌ర్మాస‌నం.. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాసి మసీదు ప్రాంగణంలో సర్వే సమయంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా..? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక్క ఇటుక కూడా తొలగించడం లేద‌ని, అలాంటి ప్రణాళిక కూడా లేదని కోర్టుకు వివ‌రించారు. ప్రస్తుతానికి అక్కడ కేవలం కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంద‌ని తెలిపారు. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పారు. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టడం లేద‌ని ఆయ‌న వివ‌రించారు.

వాద‌న‌ల అనంత‌రం ధ‌ర్మాస‌నం స‌ర్వేపై స్టే విధించింది. జూలై 26 వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి శాస్త్రీయ సర్వే చేపట్టరాదని ఆదేశించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

మొఘ‌లుల‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధారించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని కీలక తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది.

First Published:  24 July 2023 8:09 AM GMT
Next Story