Telugu Global
National

మాజీ సీజేఐ ఎన్వీ రమణ నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఆ ఉద్యోగి నియామకం రద్దు

ప్రసార భారతిలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను మొదట సుప్రీంకోర్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డిప్యుటేషన్ మీద తీసుకున్నారు. ఆయనకు అడిషనల్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ.. మీడియా కన్సల్టెంట్ వ్యవహారాలను అప్పగించారు.

మాజీ సీజేఐ ఎన్వీ రమణ నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఆ ఉద్యోగి నియామకం రద్దు
X

మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీకాలం చివరి వారంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తున్న సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను సుప్రీంకోర్టు పర్మనెంట్ ఎంప్లాయిగా చేసిన నియామకాన్ని రద్దు చేసింది. ప్రసన్న కుమార్ సుప్రీంకోర్టు అడిషనల్ సబ్‌రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఎన్వీ రమణ తన రిటైర్మెంట్‌కు వారం రోజుల ముందు నిర్ణయం తీసుకున్నారు. కాగా, సుప్రీంకోర్టు తన నియామకాన్ని రద్దు చేయడంతో ప్రసన్నకుమార్ ఇప్పటికే తన మాతృసంస్థ ఆల్ ఇండియా రేడియోకు వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది.

ప్రసార భారతిలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను మొదట సుప్రీంకోర్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డిప్యుటేషన్ మీద తీసుకున్నారు. ఆయనకు అడిషనల్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ.. మీడియా కన్సల్టెంట్ వ్యవహారాలను అప్పగించారు. ఎన్వీ రమణ సీజేఐగా 2021లో నియమించబడిన కొన్నాళ్లకే ఆయన డిప్యుటేషన్ మీద వచ్చారు. ఇక కొన్ని రోజుల్లో పదవీకాలం ముగుస్తుందనగా.. ప్రసన్నకుమార్‌ను పర్మనెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన నియామకం నిబంధనలకు పూర్తిగా విరుద్దంగా ఉందని ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టుకు చాలా మంది డిప్యుటేషన్ మీద వస్తుంటారని.. కానీ వారెవరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా నియమించడం శుభపరిణామం కాదని వ్యాఖ్యానించారు. సాధారణంగా జ్యుడీషియల్ సిస్టమ్‌లో పని చేసే వారినే డిప్యుటేషన్ మీద సుప్రీంకోర్టులో నియమిస్తారు. అకౌంట్స్, ఐటీకి సంబంధించిన వ్యవహారాలు చూడటానికి ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకొని వస్తారు. కానీ, సూర్యదేవర ప్రసన్నకుమార్ విషయంలో ఈ నిబంధనలు ఏవీ పాటించలేదని చెప్పారు.

ప్రసార భారతిలో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు) ఉద్యోగిగా ప్రసన్న కుమార్ జాయిన్ అయ్యారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛ‌టర్జీ వద్ద ఓఎస్డీగా పని చేశారు. ఇక 2009 నుంచి 2015 వరకు రాజ్యసభ చైర్ పర్సన్ హమీద్ అన్సారీ వద్ద డిప్యుటేషన్ మీద వర్క్ చేశారు. 2015లో ఆయనను ఢిల్లీ అసెంబ్లీ సెక్రటరీగా నియమిస్తూ అప్పటి అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2016లో ఈ నియామకం చెల్లదంటూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేసి ప్రసన్నను తిరిగి ప్రసార భారతికి పంపించారు. కాగా, ఆల్ ఇండియా రేడియో డైకర్టరేట్ జనరల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ప్రసన్నను అసెంబ్లీ కార్యదర్శిగా నియమించామని స్పీకర్ రామ్ నివాస్ గోయల్ చెప్పినా లెఫ్టినెంట్ గవర్నర్ పట్టించుకోలేదు.

సూర్యదేవర ప్రసన్న కుమార్‌కు 23 ఏళ్ల సర్వీస్‌లో 11 ఏళ్ల లెజిస్లేటీవ్ అనుభవం ఉందని, ఆయన పార్లమెంటులో కూడా సుదీర్ఘకాలం పని చేశారంటూ గోయల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వివాదం ముదురుతుండటంతో ప్రసారభారతి వెంటనే ఆయనను వెనక్కు పిలిచింది. సదరు ఉత్తర్వుల ప్రకారం తిరిగి విధుల్లో చేరకపోతే ఆబ్సెంట్ అని పేర్కొంటామని హెచ్చరించడంతో ఆయన తిరిగి ప్రసారభారతికి వెళ్లిపోయారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయనను అడిషనల్ రిజిస్ట్రార్‌గా నియమించడాన్ని తప్పుబట్టడంతో మరోసారి మాతృసంస్థకు వెళ్లిపోయారు.

First Published:  7 Oct 2022 5:26 AM GMT
Next Story