Telugu Global
National

సినిమా హాల్స్ లోకి ఔట్ సైడ్ ఫుడ్.. సుప్రీం కీలక తీర్పు

సినిమా థియేటర్స్ లో వాటర్ బాటిల్స్ అమ్ముకోవచ్చు, అదే సమయంలో ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా యాజమాన్యానిదే.

సినిమా హాల్స్ లోకి ఔట్ సైడ్ ఫుడ్.. సుప్రీం కీలక తీర్పు
X

ఫలానా సినిమా చూడాలా వద్దా, టికెట్ కొనాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం. అదే సమయంలో సినిమా హాల్ లోకి బయటి ఆహార పదార్థాలను అనుమతించాలా వద్దా అనేది యజమాని ఇష్టం అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. సినిమా హాళ్లలోకి ఔట్ సైడ్ ఫుడ్ ని తీసుకు రావడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తాజాగా తోసిపుచ్చింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. సినిమా హాళ్లలోకి బయటి ఆహార పదార్థాలను తీసుకు రావడంపై థియేటర్ల యాజమాన్యాలు నిషేధం విధించొచ్చని తెలిపింది. అనుమతించడానికి కూడా వారికే పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు స్పష్టం చేసింది.

చిన్న పిల్లలకు మినహాయింపు..

చిన్న పిల్లల విషయంలో మాత్రం వారికి అవసరమైన పాలు, తినుబండారాలను తల్లిదండ్రులు సినిమా హాళ్లలోకి తీసుకెళ్లడానికి అనుమతివ్వాలని యాజమాన్యాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. అదే సమయంలో ఉద్దేశ పూర్వకంగా బయటి ఆహార పదార్థాలను హాల్స్ లోకి తీసుకెళ్తామంటే కుదరదని, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు యాజమాన్యాలకు ఉందని చెప్పింది. బయట జిలేజీలు కొనుక్కుని హాల్ లోకి తీసుకెళ్లి, వాటిని తినేటప్పుడు ఆ పాకం మొత్తం సీట్లకు తుడిచేస్తామంటే ఎలా అని వ్యాఖ్యానించింది.

తాగునీరు అందుబాటులో ఉంచాలి..

సినిమా థియేటర్స్ లో వాటర్ బాటిల్స్ అమ్ముకోవచ్చు, అదే సమయంలో ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా యాజమాన్యానిదే. థియేటర్లు, మల్టీప్లెక్సులు యజమానుల ప్రైవేటు ఆస్తి కాబట్టి, బయటి నుంచి ఆహారం అనుమతించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం యాజమాన్యాలకు ఉందని ధర్మాసనం పేర్కొంది. అయితే థియేటర్ లోపల ఉన్న వాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రేక్షకులను బలవంతం చేయకూడదని సూచించింది.

First Published:  3 Jan 2023 4:37 PM GMT
Next Story