Telugu Global
National

`సుప్రీం` తీర్పులు.. ఇక‌పై ప్రాంతీయ భాష‌ల్లోనూ..

ఈ-ఎస్‌సీఆర్ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్న‌త న్యాయ‌స్థాన వెబ్‌సైట్‌లో ఇప్పుడు 34 వేల తీర్పులు అందుబాటులో ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్ల‌డించింది.

`సుప్రీం` తీర్పులు.. ఇక‌పై ప్రాంతీయ భాష‌ల్లోనూ..
X

భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చే తీర్పులు ఇక‌పై ప్రాంతీయ భాష‌ల్లోనూ అందుబాటులో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన సేవ‌ల‌ను సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్రచూడ్ బుధ‌వారం ప్రారంభించారు. ఎల‌క్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టు (ఈ-ఎస్‌సీఆర్‌)ల ప్రాజెక్టు గురువారం నుంచి మొద‌ల‌వుతుంద‌ని, ప్ర‌స్తుతానికి కొన్ని షెడ్యూల్డ్ భాష‌ల్లో తీర్పుల అనువాద ప్ర‌తులు సిద్ధంగా ఉంచామ‌ని చీఫ్ జ‌స్టిస్ చెప్పారు. వీటిని ఉచితంగానే వినియోగించుకోవ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. న్యాయ‌వాదులు, న్యాయ విద్యార్థులు, ప్ర‌జ‌ల‌కు ఇవి ఎంతో ఉప‌క‌రించే అవ‌కాశ‌ముంద‌ని చెప్పారు. దేశంలో గుర్తించిన అన్ని ప్రాంతీయ భాష‌ల్లోకి సుప్రీంకోర్టు తీర్పుల‌ను అనువదించే కృషిని కొన‌సాగించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

వెబ్‌సైట్‌లో అందుబాటులో 34 వేల తీర్పులు..

ఈ-ఎస్‌సీఆర్ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్న‌త న్యాయ‌స్థాన వెబ్‌సైట్‌లో ఇప్పుడు 34 వేల తీర్పులు అందుబాటులో ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్ల‌డించింది. అవ‌స‌ర‌మైన విష‌యం గురించి సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తే దానికి సంబంధించిన ఇంగ్లిష్ జ‌డ్జిమెంట్ ప్ర‌తులు వ‌స్తాయ‌ని తెలిపింది. దాంతో పాటు ఆ తీర్పులు అనువాద‌మైన ఇత‌ర భాష‌ల జాబితా కూడా వ‌స్తుంద‌ని పేర్కొంది. అనువాద ప్ర‌క్రియ ఇక‌పైనా కొన‌సాగుతుంద‌ని, క‌క్షిదారుల సౌక‌ర్యార్థం అనువాద ప్ర‌తుల‌ను క్ర‌మంగా అప్‌లోడ్ చేస్తూ ఉంటామ‌ని వివరించింది.

వెంక‌య్య‌నాయుడు అభినంద‌న‌లు..

ప్రాంతీయ భాష‌ల్లో సుప్రీంకోర్టు తీర్పుల‌ను అందుబాటులో ఉంచే ప్ర‌య‌త్నం గొప్ప ముంద‌డుగు అని మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ట్విట్ట‌ర్‌లో అభినందించారు. గ్రామ‌, ప‌ట్ట‌ణాల మ‌ధ్య ఉన్న తేడాను భ‌ర్తీ చేయ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంద‌ని ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

First Published:  26 Jan 2023 4:37 AM GMT
Next Story