Telugu Global
National

బిడ్డకు జన్మనిచ్చేలా యువతిని ఒప్పించిన న్యాయమూర్తులు

ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యాయమూర్తులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీజే జస్టిస్ చంద్రచూడ్‌ యువతి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

బిడ్డకు జన్మనిచ్చేలా యువతిని ఒప్పించిన న్యాయమూర్తులు
X

సుప్రీంకోర్టులో ఒక క్లిష్టమైన కేసు విచారణకు వచ్చింది. చివరకు పిటిషనర్‌ను చాంబర్‌కు పిలిపించుకుని సొలిసిటర్‌ జనరల్ సమక్షంలో న్యాయమూర్తులు ధైర్యం చెప్పి కేసును పరిష్కరించారు. 20ఏళ్ల యువతి గర్భం దాల్చింది. అబార్షన్ కోసం ప్రయత్నించగా పిండం వయసు 24 వారాలు అయినందున వైద్యులు నిరాకరించారు. పిండం వయసు ఆరు నెలలు దాటిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

బిడ్డకు జన్మనివ్వడం ఇష్టంలేని యువతి అబార్షన్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేసిన ఎయిమ్స్‌ అధికారులు అబార్షన్ మంచిది కాదని రిపోర్టు ఇచ్చారు. దాంతో సుప్రీంకోర్టు సందిగ్ధంలో పడింది. బిడ్డకు జన్మనివ్వాల్సిందే అని యువతిని బలవంతపెట్టడం ఎంతవరకు సమంజసం..? అదే సమయంలో 24 వారాలు నిండిన గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఇవ్వడం కూడా సరికాదు కదా..? అన్న మీమాంసలో పడిపోయింది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యాయమూర్తులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీజే జస్టిస్ చంద్రచూడ్‌ యువతి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ధర్మాసనంలోని ఇతర న్యాయమూర్తులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య తదితరులు విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను చాంబర్‌కు పిలిచి 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

ఈ దశలో కడుపులోని బిడ్డను చంపేయడం సరికాదని సూచించారు. పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఆ బిడ్డను దత్తతు కోసం ఒక జంట సిద్ధంగా ఉందని తుషార్ మెహతా వివరించారు. ఆ సమయంలో పుట్టబోయే శిశువును తానే పెంచుతానని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య చెప్పారు. కాబట్టి బిడ్డను చంపే పని వద్దని సూచన చేశారు. న్యాయమూర్తులే స్వయంగా ధైర్యం చెప్పడంతో బిడ్డకు జన్మనిచ్చేందుకు యువతి అంగీకరించింది.

First Published:  5 Feb 2023 3:37 AM GMT
Next Story