Telugu Global
National

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి నోటీసులిచ్చిన సుప్రీం కోర్టు

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్, కార్యకర్త-లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి నోటీసులిచ్చిన సుప్రీం కోర్టు
X

గుజరాత్ మతకలహాల మీద బీబీసీ ప్రసారం చేసిన‌ డాక్యుమెంటరీని మోడీ సర్కార్ నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పబ్లిక్ డొమైన్ నుండి డాక్యుమెంటరీని తీసివేయాలన్న ఉత్తర్వు యొక్క ఒరిజినల్ కాపీని కూడా అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్, కార్యకర్త-లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

డాక్యుమెంటరీని బ్లాక్ చేయడానికి, సోషల్ మీడియా నుండి లింక్‌లను తీసివేయడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని పిటిషన్‌లు సవాలు చేశాయి. ఈ నిషేధం ఏకపక్షం,రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ML శర్మ ప్రత్యేక పిటిషన్‌లో పేర్కొన్నారు.

జనవరి 21న, కేంద్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 కింద అత్యవసర నిబంధనలను ఉపయోగించి, బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" లింక్‌లను యూట్యూబ్ నుండి, ట్విట్టర్ నుండి బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

నిషేధం తర్వాత, రెండు భాగాల BBC సిరీస్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాతో సహా వివిధ ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనేక విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు బహిరంగ ప్రదర్శనలను నిర్వహించాయి.

బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ విషయంపై అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, పోలీసులకు ఘర్షణలు జరిగాయి. అనేక మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  3 Feb 2023 9:31 AM GMT
Next Story