Telugu Global
National

నిప్పుతో చెలగాటమాడుతున్నారు.. తమిళనాడు, పంజాబ్ గవర్నర్ల తీరుపై సుప్రీం ఆగ్రహం

12 బిల్లులకు గవర్నర్ ఆమోదం ల‌భించ‌లేద‌ని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. పంజాబ్ ప్రభుత్వం కూడా ఇదే విషయమై సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. తాజాగా

నిప్పుతో చెలగాటమాడుతున్నారు.. తమిళనాడు, పంజాబ్ గవర్నర్ల తీరుపై సుప్రీం ఆగ్రహం
X

తమిళనాడు, పంజాబ్ గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఆమోదించి పంపిన బిల్లులను ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని ప్రశ్నించింది. దేశంలో అనాదిగా వస్తున్న నియమ, నిబంధనలను గవర్నర్లు అనుసరించాలని సూచించింది. తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు అసెంబ్లీలో పాస్ చేసిన పలు బిల్లులను క్లియర్ చేయకుండా ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎన్ రవి, భన్వరిలాల్ పురోహిత్ తమ వద్ద పెండింగ్‌లో పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి.

పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ గవర్నర్లు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం శాసనసభలో చేసిన 12 బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపితే ఆర్ఎన్ రవి వాటిని క్లియర్ చేయకుండా తన వద్దే పెట్టుకున్నారు. పలు కీలక బిల్లులు పెండింగ్ లో పడిపోవడంతో పాలనకు ఇబ్బందికరంగా మారింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. గవర్నర్ తీరు పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు నేరుగా విమర్శలు చేస్తున్నా.. ఆర్ఎన్ రవి పట్టించుకోవడం లేదు.

12 బిల్లులకు గవర్నర్ ఆమోదం ల‌భించ‌లేద‌ని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. పంజాబ్ ప్రభుత్వం కూడా ఇదే విషయమై సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. తాజాగా ఈ రెండు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది.

ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పాస్ చేయ‌కుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని గవర్నర్లను ప్రశ్నించింది. ఇది ఆందోళన కలిగించే తీవ్రమైన విషయమని పేర్కొంది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. భారతదేశంలో కొనసాగుతున్న సంప్రదాయాలు, నియమ నిబంధనలను గవర్నర్లు అనుసరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, పంజాబ్ గవర్నర్ భన్వరి లాల్ పురోహిత్ ఒకప్పుడు బీజేపీలో కీలకంగా మెలిగిన నాయకులు. కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ అధికారంలోని లేని తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను గవర్నర్లుగా నియమించిందన్న విమర్శలున్నాయి. బీజేపీ కోరుకున్నట్లుగానే ఆయా గవర్నర్లు కేంద్రానికి అనుకూలంగా నడుచుకుంటుండ‌టంతో విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.

First Published:  10 Nov 2023 3:19 PM GMT
Next Story