Telugu Global
National

పోలీసుల దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

దర్యాప్తు ఎలా చేయాలన్న అంశంపై విచారణాధికారులకు ఓ స్థిరమైన, విశ్వసనీయమైన నియమావళిని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పోలీసుల దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
X

నేరాలు చేసినవారు చాలా కేసుల్లో సాంకేతిక కారణాలతోనే తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు ఎలా చేయాలన్న అంశంపై విచారణాధికారులకు ఓ స్థిరమైన, విశ్వసనీయమైన నియమావళిని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఒక కేసులో మరణశిక్ష, యావజ్జీవ ఖైదు పడిన నిందితులను విడుదల చేస్తూ.. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జేబీ పార్టీవాలా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నేరాలు చేసినవారు సాంకేతిక కారణాలతో తప్పించుకోకూడదని స్పష్టం చేసింది. కానీ అనేక కేసుల్లో ఇదే జరుగుతోందని పేర్కొంది. దీంతో పాటు మరో కేసులో దీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలకు ముందస్తు విడుదల అవకాశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 26 ఏళ్లుగా కస్టడీలో ఉన్న ఓ 67 ఏళ్ల ఖైదీ విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సత్ప్రవర్తన గల ఖైదీలకు క్షమాభిక్షను దూరం చేయడం సరికాదని ఈ సందర్భంగా పేర్కొంది.


First Published:  23 Sep 2023 7:08 AM GMT
Next Story