Telugu Global
National

ప్రచారం కోసం కేసులు వేస్తారా..? ఆ పార్టీకి సుప్రీం చీవాట్లు..

గుర్తింపు కావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు తెచ్చుకోవాలని, అంతే కాని కోర్టులో కేసులు వేసి తమ సమయం వృథా చేయొద్దని హెచ్చరించింది సుప్రీంకోర్టు.

ప్రచారం కోసం కేసులు వేస్తారా..? ఆ పార్టీకి సుప్రీం చీవాట్లు..
X

ఎన్నికల ఫలితాలతో రాని గుర్తింపు, కోర్టులో పిటిషన్లు వేస్తే వస్తుందా అంటూ సుప్రీంకోర్టు ఓ రాజకీయ పార్టీకి చీవాట్లు పెట్టింది. గుర్తింపు కావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు తెచ్చుకోవాలని, అంతే కాని కోర్టులో కేసులు వేసి తమ సమయం వృథా చేయొద్దని హెచ్చరించింది. ఈవీఎంలను రద్దు చేయాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన జన వికాస్ పార్టీ వేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలపై పదే పదే కేసులు వేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందుకు ఆ పార్టీకి 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది సుప్రీంకోర్టు.

ఈవీఎంలపై రచ్చ..

బ్యాలెట్ ఓటింగ్ నుంచి ఓ అడుగు ముందుకేసి ఈవీఎంల వైపు వస్తున్నాయి అన్ని దేశాలు. ఈ క్రమంలో కొంతమంది ఈవీఎంలు వద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈవీఎంలు ఉంచాలా, రద్దు చేయాలా అనేది ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. అయితే దీనిపై ఇటీవల కొంతమంది కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. మధ్యప్రదేశ్ జన వికాస్ పార్టీ కూడా ఇలా కోర్టు కేసులతో ఫేమస్ అవుతోంది. ఇప్పటికే ఈ పార్టీ వేసిన ఓ పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత కూడా జన వికాస్ పార్టీ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. సుప్రీం మెట్లెక్కింది. దీంతో సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేయడంతోపాటు చీవాట్లు కూడా పెట్టింది.

ఇదో రకం ప్రచారం..

కోర్టులో పిటిషన్లు వేయడం, ప్రజా ప్రయోజనాల కోసం తాము నడుం బిగించినట్టు ప్రచారం చేసుకోవడం.. ఈ ధోరణి ఇటీవల ఎక్కువైందంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం జన వికాస్ పార్టీతోనే పోదని, మిగతా చిన్నా చితకా పార్టీలు కూడా ఇలా ప్రచారం పొందాలని చూస్తున్నాయంటూ ధర్మాసనం కోప్పడింది. రాజకీయ పార్టీలకు ప్రచారం కావాలంటే పిటిషన్లతో రాదని, ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు గెలుపొందాలని చురకలంటించింది.

First Published:  1 Oct 2022 6:03 AM GMT
Next Story