Telugu Global
National

భీమా కోరేగావ్ కేసు: ఆనంద్ తేల్తుంబ్డే కు బెయిల్ ఓకే... NIA పిటిషన్ ను తిరస్కరించిన‌ సుప్రీం కోర్టు

ఆనంద్ తేల్తుంబ్దేకు నవంబర్ 18న బాంబే హైకోర్టు బెయిల్ ఇస్తూ ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం రోజుల పాటు బెయిల్‌పై స్టే విధించింది. ఈ రోజు ఎన్‌ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ప్రస్తుతం జైల్లో ఉన్న తేల్తుంబ్డే విడుదల కానున్నారు

భీమా కోరేగావ్ కేసు: ఆనంద్ తేల్తుంబ్డే కు బెయిల్ ఓకే... NIA పిటిషన్ ను తిరస్కరించిన‌ సుప్రీం కోర్టు
X

భీమా కోరేగావ్ కేసులో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే కు బోంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ కు వ్యతిరేకంగా ఎన్ ఐ ఏ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం "ఈ పిటిషన్‌ను మేము స్వీకరించడం లేదు.'' అని వ్యాఖ్యానించింది.

ఆనంద్ తేల్తుంబ్దేకు నవంబర్ 18న బాంబే హైకోర్టు బెయిల్ ఇస్తూ ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం రోజుల పాటు బెయిల్‌పై స్టే విధించింది. ఈ రోజు ఎన్‌ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ప్రస్తుతం జైల్లో ఉన్న తేల్తుంబ్డే విడుదల కానున్నారు

NIA తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ, తేల్తుంబ్డే మావోయిస్టు కార్యకలాపాలలో పాలుపంచుకున్నాడని, పౌరులలో, ముఖ్యంగా భద్రతా దళాల సిబ్బందిలో భావజాల ప్రచారం చేశాడని, బలవంతపు నిధులు వసూళ్ళు, హింసాత్మక దాడులు చేసిన నిషిద్ధ సంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని ఆరోపించారు.

తేల్తుంబ్డే తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, NIA ఆరోపణలను తిప్పికొట్టారు. తన క్లయింట్ విద్యావేత్త అని, పూణేలో జరిగిన భీమా కోరేగావ్ కార్యక్రమానికి తేల్తుంబ్డే హాజరయ్యారని కానీ, అక్కడ ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసినట్లు కానీ చూపించడానికి NIA వద్ద ఒక్క డాక్యుమెంట్ కూడా లేదని తెలిపారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై తేల్తుంబ్డేను ఏప్రిల్ 2020లో అరెస్టు చేశారు. 73 ఏళ్ల తేల్తుంబ్డే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతను ప్రస్తుతం నవీ ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు.

ఈ కేసులో సహ నిందితులు వరవరరావు, సుధా భరద్వాజ్ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన మూడో నిందితుడు తెల్తుంబ్డే . వైద్య కారణాలతోవరవరరావుకు బెయిల్ మంజూరైంది. భరద్వాజ్‌కు డిఫాల్ట్ బెయిల్ లభించింది.

UAPA కింద ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు చూపించడానికి NIA ఎటువంటి సాక్ష్యాలను సమర్పించలేద‌ని హైకోర్టు తేల్తుంబ్డేకు బెయిల్ మంజూరు చేసింది.

"UAPAలోని సెక్షన్ 15 చెప్తున్నట్టుగా తేల్తుంబ్డే 'ఉగ్రవాద చర్య'కు పాల్పడ్డారని గానీ లేదా అందులో పాలుపంచుకున్నారని గానీ నేరారోపణ చేసే ఎటువంటి మెటీరియల్‌ని ఎన్ ఐ ఏస్వాధీనం చేసుకోలేదు" అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story