Telugu Global
National

పెద్దలపై విమర్శలే వారిని జడ్జిలుగా అనర్హులను చేస్తున్నాయా..?

ఈ సందర్భంగా కేంద్రంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది కొలిజియం. కొందరి అభిప్రాయాలు జడ్జిల నియామకాల్లో అభ్యర్థులకు అనర్హతగా భావించలేమని స్పష్టం చేసింది.

పెద్దలపై విమర్శలే వారిని జడ్జిలుగా అనర్హులను చేస్తున్నాయా..?
X

ఇటీవల న్యాయమూర్తుల నియామకంలో తమ జోక్యం ఉండాలని కేంద్రం తపిస్తోంది. న్యాయమూర్తుల ఎంపికలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు లేఖ కూడా రాశారు. ఇప్పటికే జడ్జిల నియామకం కోసం కొలిజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం పదేపదే తిరస్కరిస్తోంది. గతంలో బీజేపీ పెద్దలపై చేసిన విమర్శల కారణంగానే కొందరి పేర్లను న్యాయమూర్తులుగా కేంద్రం అంగీకరించడం లేదన్న విమర్శ ఉంది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పదేపదే తిరస్కరించకూడదని వ్యాఖ్యానించింది. గతంలో చేసిన సిఫార్సుల్లోని పేర్లతో మరోసారి న్యాయమూర్తుల నియామకం కోసం జాబితాను కేంద్రానికి పంపింది. కొందరు అభ్యర్థులపై నిఘా విభాగాలు, న్యాయశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కొలిజియం తోసిపుచ్చింది. బాంబే, కలకత్తా, మద్రాస్, ఢిల్లీ హైకోర్టుల కోసం గతంలో ఎంపిక చేసిన ఐదుగురు సీనియర్ న్యాయవాదుల పేర్లను తాజా జాబితాలో మరోసారి కేంద్రానికి పంపించారు.

ఈ సందర్భంగా కేంద్రంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది కొలిజియం. కొందరి అభిప్రాయాలు జడ్జిల నియామకాల్లో అభ్యర్థులకు అనర్హతగా భావించలేమని స్పష్టం చేసింది. ప్రతిభ, యోగ్యత, నైతికత, నిజాయితీ ఉన్న వ్యక్తులే జడ్జిలుగా నియామకానికి అర్హులవుతారని కొలిజియం వ్యాఖ్యానించింది. జాబితాలో ఉన్న న్యాయవాది సోమశేఖర్‌ సుందరేశన్‌ పేరును కేంద్రానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయడం ఇది మూడో సారి. ఆయన సోషల్ మీడియాలో గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికి అడ్డుపుల్ల వేస్తోంది.

న్యాయవాదులు అమితేశ్ బెనర్జీ, సక్యాసేన్‌ల పేరును సిఫార్సు చేయడం ఇది రెండోసారి. అమితేశ్‌ తండ్రి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యుసి బెనర్జీ. గోధ్రాలో జరిగిన సబర్మతి రైలు ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని కమిటీ కమిషన్‌ చైర్మన్‌ హోదాలో గతంలో తేల్చారు. అది కూడా అమితేశ్‌ పేరును కేంద్రం వెనక్కు పంపడానికి ఒక కారణంగా చెబుతున్నారు.

ఆర్‌. జాన్‌ సత్యం మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయవాది. ప్రధాని మోడీపై వచ్చిన ఒక విమర్శనాత్మక కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు గాను ఆయన పేరుపై నిఘా వర్గాలు అభ్యంతరం తెలిపాయన్న ప్రచారం ఉంది. సత్యం పేరును తిరస్కరించడాన్ని కూడా సుప్రీంకోర్టు కోలిజయం తప్పుపట్టింది. జాన్‌ సత్యంకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని.. ఆయన నిజాయితీపరుడని కొలిజియం అభిప్రాయపడింది. ఇలా తమకు అనుకూలంగా ఉండరన్న భావనతోనే కొందరి పేర్లను పదేపదే కేంద్రం వెనక్కు పంపుతోందన్న విమర్శ ఉంది.

తాజాగా కొలిజియం ఐదుగురి పేర్లను మరోసారి సిఫార్సు చేయడంతో పాటు మరో 20 మంది పేర్లను కూడా వివిధ హైకోర్టుల్లో జడ్జిలుగా నియామకం కోసం కేంద్రానికి పంపింది. అటు కొలిజియం, ఇటు కేంద్రం మెల్లమెల్లగా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. కొలిజియం చెప్పినంత మాత్రాన కేంద్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో వింటుందా అన్నది చూడాలి.

First Published:  20 Jan 2023 4:00 AM GMT
Next Story