Telugu Global
National

ఛీఛీ.. యువతను చెడగొడతారా..? ఏక్తా కపూర్ కి సుప్రీం చీవాట్లు..

అరెస్ట్ వారంట్ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కిన నిర్మాత ఏక్తా కపూర్ చివరకు చీవాట్లు తినాల్సి వచ్చింది. దేశంలోని యువత మనసుల్ని కలుషితం చేస్తున్నారంటూ సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆమెను మందలించింది.

ఛీఛీ.. యువతను చెడగొడతారా..? ఏక్తా కపూర్ కి సుప్రీం చీవాట్లు..
X

సినిమాలు, సీరియళ్లలో అడల్ట్ కంటెంట్ తో బాలీవుడ్ లో రచ్చ చేసిన ఏక్తా కపూర్.. ఓటీటీల్లో అంతకంటే విశృంఖలత్వాన్ని చూపిస్తున్నారు. ఏఎల్టీ బాలాజీ ఓటీటీ కోసం ఆమె రూపొందించిన ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ వెబ్ సిరీస్ విషయంలో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వారంట్ ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కిన నిర్మాత ఏక్తా కపూర్ చివరకు చీవాట్లు తినాల్సి వచ్చింది. దేశంలోని యువత మనసుల్ని కలుషితం చేస్తున్నారంటూ సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆమెను మందలించింది.

ఎందుకీ వారెంట్.. ?

ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్ లో సైనికుల కుటుంబాలకు సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయి. సైనికుల కుటుంబంలోని మహిళల్ని కించపరిచేలా చూపించారు. దీనిపై మాజీ సైనికుడు శంభు కుమార్ న్యాయపోరాటానికి దిగారు. సైనికుల కుటుంబాలను ఇంత నీచంగా చూపిస్తారా అంటూ కోర్టు మెట్లెక్కారు. బీహార్‌ లోని బెగుసరాయ్‌ లోని ట్రయల్ కోర్టు ఈ ఫిర్యాదుపై విచారణ జరిపింది. ఏక్తా కపూర్ కి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అరెస్ట్ వారెంట్ ని రద్దు చేయాలంటూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆమె తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అది ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తీసిన కంటెంట్ అని, దాన్ని కేవలం సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే చూడగలరని, అది అందరికోసం కాదని ఆయన తెలిపారు. తెలివిగా ఇచ్చిన ఈ సమాధానికి సుప్రీం ఘాటుగా బదులిచ్చింది. ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండేదని, ఇలాంటి వాటిని చూపిస్తూ మీరు చందాదారుల్ని ఆకర్షిస్తున్నారా అని ప్రశ్నించింది. మీరు ఈ దేశంలోని యువత మనసుల్ని కలుషితం చేస్తున్నారంటూ ఏక్తా కపూర్ ని మందలించింది. మరోసారి ఇలాంటి పరిస్థితుల్ని పునరావృతం చేయొద్దని హెచ్చరించింది.

First Published:  15 Oct 2022 4:35 AM GMT
Next Story