Telugu Global
National

అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతి

25 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక అత్యాచార బాధితురాలు అబార్షన్ కోసం గుజరాత్ హైకోర్టులో దరఖాస్తు చేసింది. కేసు జాప్యం అవుతుండటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతి
X

గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆమె 27 వారాల గ‌ర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు ఆనందం ఇస్తుందని, అయితే ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు.. అది ఆమె మానసిక ప్ర‌శాంత‌త‌ను దెబ్బతీస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఆగస్టు 19న ఈ అంశంపై విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నుంచి తాజా నివేదికను కోరింది. బాధితురాలి మెడికల్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అబార్షన్ కోసం బాధితురాలు చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడం సరికాదని పేర్కొంది.

25 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక అత్యాచార బాధితురాలు అబార్షన్ కోసం గుజరాత్ హైకోర్టులో దరఖాస్తు చేసింది. కేసు జాప్యం అవుతుండటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాధితురాలి మానసిక స్థితి, వైద్య రిపోర్టులను పరిగణలోకి తీసుకొని ఆమె తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. తక్షణమే ఆమె ఆస్ప‌త్రిలో చేరాలని ఆదేశించింది. ఒకవేళ అబార్షన్ సమయానికి పిండం సజీవంగా ఉన్నట్లు తేలితే, పిండం ఇంక్యుబేషన్ సహా అవసరమైన అన్ని సహాయాలను ఆస్ప‌త్రి అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. చట్ట ప్రకారం ఆ బిడ్డను ఆ రాష్ట్రం దత్తత తీసుకోవాల్సిందిగా పేర్కొంది.

బాధిత మహిళ తన గర్భాన్ని తొల‌గించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఈనెల 7వ తేదీన గుజరాత్ హైకోర్టును ఆదేశించింది. విచారణ, వైద్య నివేదిక అన్నీ పూర్త‌య్యి కేసు 11న విచారణకు రాగానే కోర్టు ఆ కేసును 12 రోజులకు (23వ తేదీకి) వాయిదా వేసింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈలోపే హైకోర్టు శనివారం రోజున కేసును కొట్టేసింది.

గుజరాత్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు ఒక తేదీని నిర్ణయించినప్పుడు, హైకోర్టు తీర్పు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

అయితే గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం ఇదంతా క్లరికల్ తప్పిదం అన్నారు. ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున‌ న్యాయమూర్తిని అభ్యర్థిస్తామని తెలిపారు.

First Published:  21 Aug 2023 10:25 AM GMT
Next Story