Telugu Global
National

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌పై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ని రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా వెళ్లి చూడటం విశేషం. మ్యాచ్‌ అనంతరం ముంబై నుంచి చెన్నై తిరిగి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌పై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
X

క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ పైనే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి. భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరడం భారత క్రికెట్‌ అభిమానులను ఆనందంలో ఊపేస్తుండగా.. ఈ వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా అదే ఊపు కొనసాగాలని ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. మరోపక్క రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి మరోసారి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఒకింత ఆందోళన రేకెత్తించే అంశమే. ఈ క్రమంలో సహజంగా క్రికెట్‌కు పెద్ద అభిమాని అయిన స్టార్‌ హీరో రజనీకాంత్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రపంచకప్‌ భారత్‌కే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కివీస్‌ బ్యాటింగ్‌ సమయంలో టెన్షన్‌ పడ్డాం..

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ని రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా వెళ్లి చూడటం విశేషం. మ్యాచ్‌ అనంతరం ముంబై నుంచి చెన్నై తిరిగి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘టార్గెట్‌ను చేరుకునేందుకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది’ అని చెప్పారు. కానీ, మొదటి గంటన్నర మాత్రం చాలా ఆందోళన చెందామన్నారు.

ఈసారి ప్రపంచకప్‌ వంద శాతం భారత్‌కే వస్తుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే సెమీ ఫైనల్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లి, షమీలకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తాజాగా ఆయన స్పిన్నర్‌ అశ్విన్‌తో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలో జరిగిన మ్యాచ్‌ అనంతరం రజనీ ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా ‘లాల్‌ సలామ్‌’..

ఇక రజనీకాంత్‌ తాజాగా నటించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘జైలర్‌’ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన తర్వాత రజనీకాంత్‌ నటిస్తున్న మరో చిత్రానికి టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  17 Nov 2023 8:11 AM GMT
Next Story