Telugu Global
National

ఈ ఏడాది వెచ్చని శీతాకాలం.. ఎల్‌నినో ఎఫెక్ట్‌

డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మూడు నెలల శీతాకాలానికి సంబంధించి దేశంలో చలి, వర్షాలపై భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఈ ఏడాది వెచ్చని శీతాకాలం.. ఎల్‌నినో ఎఫెక్ట్‌
X

ఈ ఏడాది శీతాకాలం వేడిగా ఉండనుంది. చలిగాలుల తీవ్రత తగ్గనుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో డిసెంబర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో దేశంలో వాతావరణంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేశారు.

డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మూడు నెలల శీతాకాలానికి సంబంధించి దేశంలో చలి, వర్షాలపై భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలోని ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో చలి తగ్గనుందని వాతావరణ విభాగం తెలిపింది. చలిగాలుల తీవ్రత తగ్గి, మూడు నెలల్లో అతిశీతల దినాలు (కోల్డ్‌ డేస్‌) తక్కువగా నమోదుకానున్నాయని ఐఎండీ పేర్కొంది.



దేశంలోని చాలా ప్రాంతాలలో డిసెంబర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వాయవ్య, మధ్య, తూర్పు భారతాల్లో కొన్ని ప్రాంతాల్లో తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతాయి. డిసెంబర్‌లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని మహపాత్ర తెలిపారు. 2023డిసెంబర్ లో దేశవ్యాప్తంగా నెలవారీ వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన వివరించారు. అలాగే దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, ఏపీ, కర్నాటకల్లో సాధారణ వర్షపాతం, మిగిలిన రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

First Published:  2 Dec 2023 10:28 AM GMT
Next Story