Telugu Global
National

యాత్రలో ఉద్రిక్తత.. ఎస్పీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

‘‘ఎమ్మెల్యే గండ్ర నీకు చుట్టం కావొచ్చు, నీ గుడ్డలు ఊడే సమయం దగ్గరపడింది.’’ అంటూ ఎస్పీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? అని ఎస్పీని ప్రశ్నించారు.

యాత్రలో ఉద్రిక్తత.. ఎస్పీకి రేవంత్ రెడ్డి వార్నింగ్
X

రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆమధ్య యూత్ కాంగ్రెస్ లీడర్ పై దాడితో కలకలం రేగింది. తాజాగా భూపాలపల్లిలో జరుగుతున్న యాత్రలో కొంతమంది కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. అయితే ఇవి రేవంత్ రెడ్డికి తగల్లేదు కానీ, కింద ఉన్న కొంతమంది కార్యకర్తలకు తగిలాయి. దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభపై ఆవారాగాళ్లు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరికే ఉంటారా? అంటూ పోలీసులపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ ఉందని తాము ఒక రోజు యాత్రను వాయిదా వేసుకున్నామని.. కానీ దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాత్రి వరకు యాత్ర ప్రశాంతంగానే కొనసాగినా, భూపాలపల్లిలో రేవంత్ ప్రసంగించే సమయానికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోడిగుడ్లు, టమోటాలతో రేవంత్ రెడ్డిపై దాడి చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ అనుచరులు కొంతమందిని పోలీసులు అక్కడినుంచి తరలించారు. వారిని స్థానిక సినిమా థియేటర్లో పెట్టి తాళం వేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. తాను తలచుకుంటే ఎమ్మెల్యే గండ్ర ఇల్లు ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఎస్పీకి కూడా వార్నింగ్..

మరోవైపు కోడిగుడ్లు విసరడానికి వచ్చినవారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాటలో ఎస్సై శ్రీనివాస్ కి గాయాలైనట్టు తెలుస్తోంది. పోలీసుల వల్లే ఇదంతా జరిగిందని, చివరకు వారే ఇబ్బంది పడ్డారని అన్నారు రేవంత్ రెడ్డి. ‘‘ఎమ్మెల్యే గండ్ర నీకు చుట్టం కావొచ్చు, నీ గుడ్డలు ఊడే సమయం దగ్గరపడింది.’’ అంటూ ఎస్పీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? అని ఎస్పీని ప్రశ్నించారు. మొత్తమ్మీద ప్రశాంతంగా మొదలైన రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర.. రాను రాను హాట్ హాట్ గా సాగుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అంచనాలకు అందడం లేదు. ఒకరకంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి వార్తలతోనే రేవంత్ యాత్ర మరింతగా హైలెట్ అవుతోంది.

First Published:  1 March 2023 1:42 AM GMT
Next Story