Telugu Global
National

యడ్యూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై పోలీసుల లాఠీ చార్జ్ వీడియో వైరల్

ముఖ్యమంత్రి బొమ్మై, యడ్యూరప్ప దిష్టిబొమ్మలను దహనం చేశారు. యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

యడ్యూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై పోలీసుల లాఠీ చార్జ్ వీడియో వైరల్
X

కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంజారా కమ్యూనిటీకి చెందినవారు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. శివమొగ్గ జిల్లా షికారిపురలోని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నివాసంపై బంజారాలు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్లలో బంజారా కులానికి చెందినవారు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు. 17 శాతం వరకు వారే లబ్ధి పొందుతున్నారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలో షెడ్యూల్ కులాల్లోని ఉప కులాలకు రిజర్వేషన్లకు సంబంధించి జస్టిస్ సదాశివ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం షెడ్యూల్ కులాల్లోని ఉప కులాలకు జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ప్రాతినిథ్యం కల్పించాలని సిఫార్సు చేసింది. అయితే ఆ కమిటీ నివేదికను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంజారా కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము 17 శాతం రిజర్వేషన్ పొందుతుండగా.. ఇప్పుడు 4.5 శాతానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని కొద్దిరోజులుగా బంజరాలు నిరసనలు తెలుపుతున్నారు.

సోమవారం వారు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు ఎప్పటిలాగే రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి బొమ్మై, యడ్యూరప్ప దిష్టిబొమ్మలను దహనం చేశారు. యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసుల దాడికి సెకండ్ల వ్యవధిలో ఆందోళకారులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

First Published:  27 March 2023 1:52 PM GMT
Next Story