Telugu Global
National

ప్రమాదాలు, రాళ్లదాడులు.. వార్తల్లో వందే భారత్

విశాఖ ఘటన తర్వాత ఇప్పుడు బీహార్ లో వరుసగా రెండుసార్లు రాళ్లదాడి జరిగింది. కతిహార్‌ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లదాడికి పాల్పడ్డారు.

ప్రమాదాలు, రాళ్లదాడులు.. వార్తల్లో వందే భారత్
X

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఏ మహూర్తాన మోదీ ప్రారంభించారో కానీ.. ఆ ఎక్స్ ప్రెస్ వార్తల్లోకెక్కని రోజంటూ లేదు. ఆయితే ప్రమాదాలు, లేకపోతే రాళ్లదాడులు.. ఇలా వరుస ఘటనలతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు వార్తల్లోకెక్కుతున్నాయి. ఈసారి బీహార్ లో వరుసగా రాళ్లదాడులు జరగడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రాళ్లదాడి జరిగే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామంటున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న వందే భారత్ పై కూడా రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ గతంలో చాలా సార్లు వార్తల్లోకెక్కింది. ఎద్దులు, గేదెల్ని ఢీకొనడంతో ఆ ఎక్స్ ప్రెస్ ఎప్పుడూ చర్చనీయాంశమయ్యేది. ఆ రైలు ఎక్కితే గమ్యస్థానానికి సకాలంలో చేరతారా లేదా అనే విషయంలో అన్నీ అనుమానాలే. ఆ తర్వాత ఇప్పుడు రాళ్లదాడి మొదలైంది. విశాఖ ఘటన తర్వాత ఇప్పుడు బీహార్ లో వరుసగా రెండుసార్లు రాళ్లదాడి జరిగింది. కతిహార్‌ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లదాడికి పాల్పడ్డారు. న్యూ జల్పాయ్ గురి నుంచి డిసెంబర్ 30న ఈ రైలుని ప్రారంభించారు. ఇటీవలే ఓ సారి దాడి జరగగా, మళ్లీ ఇప్పుడు దాడి జరిగింది. సి-6 బోగీ అద్దం పగిలింది కానీ ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు.

సెల్ఫీకోసం చిక్కుకున్న పెద్దమనిషి..

సికింద్రాబాద్-విశాఖ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో సెల్ఫీ కోసం ఎక్కిన ఓ వ్యక్తి డోర్లు లాక్ అయిపోవడంతో అందులోనే ఇరుక్కుపోయాడు. టీసీలను బతిమిలాడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఫైన్ కట్టాడు, అనవసరంగా ప్రయాణ భారం మోయాల్సి వచ్చింది. ఇలా వరుస సంఘటనలతో వందే భారత్ వార్తల్లో రైలుగా నిలుస్తోంది.

First Published:  21 Jan 2023 10:47 AM GMT
Next Story