Telugu Global
National

బీఎస్ఎన్ఎల్ సిమ్స్ తీసేసి జియో వాడండి.. పోలీసులకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు

కర్ణాటక పోలీసు శాఖ 38,347 బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను వాడుతోంది. ఇవన్నీ ఈ ఆదేశాలతో ఒక్కసారిగా జియోలోకి మారిపోబోతున్నాయి.

బీఎస్ఎన్ఎల్ సిమ్స్ తీసేసి జియో వాడండి.. పోలీసులకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు
X

ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ పట్ల బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు మేలు చేసేలా.. బీఎస్ఎన్ఎల్‌ను అణగదొక్కేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బీఎస్ఎన్ఎల్ మరింతగా నష్టపోబోతోంది. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులకు బీఎస్ఎన్ఎల్ సేవలు అందుతున్నాయి. కర్ణాటకలోని అన్ని శాఖల ఉద్యోగులకు బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు ఉన్నాయి. తాజాగా పోలీస్ శాఖకు చెందిన బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు అన్నింటినీ ఒకే సారి పోర్ట్ చేసి జియోకు నెట్‌వర్క్‌కు మార్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

కర్ణాటక పోలీసు శాఖ 38,347 బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను వాడుతోంది. ఇవన్నీ ఈ ఆదేశాలతో ఒక్కసారిగా జియోలోకి మారిపోబోతున్నాయి. ఈ మేరకు కమ్యునికేషన్స్, లాజిస్టిక్స్ అండ్ మోడ్రనైజేషన్ అడిషనల్ డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు. ఏ టెలికాం కంపెనీ అయినా ఒకటి రెండు కనెక్షన్లు కోల్పోయినా.. తిరిగి వారిని తమ నెట్‌వర్క్ లోనికి రప్పించడానికి చాలా కష్టాలు పడుతుంది. అలాంటిది ఒకే సారి బీఎస్ఎన్ఎల్ దాదాపు 39వేల కనెక్షన్లు కోల్పోతుండటంతో ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ తీరుపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం మండిపడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాల్సింది పోయి ప్రైవేటు కంపెనీకి కొమ్ముకాయడంపై ఉద్యోగుల సంఘం కార్యదర్శి గుండన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ విస్తరణకు సహాయం చేయకపోగా.. ఉన్న కనెక్షన్లను కూడా వేరే టెలికాంకు అప్పగించడం ఏంటని విమర్శించారు.

కాగా, అడిషనల్ డీజీపీ జారీ చేసిన సర్క్యులర్‌ను పోలీసు శాఖ సమర్ధించుకున్నది. ఇది కేవలం ఒక కమర్షియల్ డెషిషన్ అని చెప్పారు. పోలీసులు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి పని చేయాల్సి ఉంటుంది.అక్కడ బీఎస్ఎన్ఎల్‌కు సరైన నెట్‌వర్క్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. జియో నెట్‌వర్క్ అంతటా ఉండటం వల్లే దానికి పోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి చెబుతున్నారు. పోలీస్ శాఖ కొన్ని యాప్స్ ఉపయోగిస్తుంది. దానికి ఫాస్ట్‌గా ఉండే డేటా నెట్‌వర్క్ కావాలి. చాలా టెలికాంలు 5జీ నెట్‌వర్క్‌ను ఇస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్‌లో 4జీ కూడా స్పీడ్‌గా రావడం లేదని ఆయన చెప్పారు. కర్ణాటక ట్రాన్స్‌పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ యాక్ట్ 1999 ప్రకారమే జియో నెట్‌వర్క్‌కు మారాలనే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.




First Published:  26 Feb 2023 3:52 AM GMT
Next Story