Telugu Global
National

జగన్ గోరుముద్ద.. స్టాలిన్ బ్రేక్ ఫాస్ట్

విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడే కావడం విశేషం. నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీంను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు తానే వడ్డించారు.

జగన్ గోరుముద్ద.. స్టాలిన్ బ్రేక్ ఫాస్ట్
X

దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూల్స్ కి వచ్చే విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. అయితే ఏపీలో మాత్రం దానికి జగనన్న గోరుముద్ద అనే పేరు పెట్టి ఓ బ్రాండింగ్ ఇచ్చారు. ఇక స్కూళ్లలో ఉదయం పూట జగనన్న రాగి జావను ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మరో అడుగు ముందుకేశారు. ఆయన స్టాలిన్ బ్రేక్ ఫాస్ట్ ని ఈరోజు నుంచి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులందరికీ ఉదయం పూట అల్పాహారాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టింది తమిళనాడు ప్రభుత్వం.


కనీసం మధ్యాహ్న భోజనం కోసమయినా విద్యార్థులను తల్లిదండ్రులు స్కూల్ మాన్పించకుండా పంపిస్తారనేది ప్రభుత్వాల ఆలోచన. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్న రాష్ట్రాల్లో ఆ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టే చెప్పుకోవాలి. ఇప్పుడు తమిళనాడు ఉదయం పూట టిఫిన్ కూడా పెడుతోంది. అంటే ఉదయం పిల్లల కోసం ప్రత్యేకంగా అల్పాహారం సిద్ధం చేసే అవసరం కూడా తల్లిదండ్రులకు ఉండదు. ఉదయాన్నే వారిని స్కూల్ కి రెడీ చేసి పంపిస్తే, అక్కడే టిఫిన్, మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రం తిరిగి వస్తారు.

దేశంలోనే తొలి ప్రయత్నం..

ఇప్పటి వరకూ కేంద్రం సహకారంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయి. తమిళనాడు ఉచిత అల్పాహార పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడే కావడం విశేషం. నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీంను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు తానే వడ్డించారు. గతేడాది సెప్టెంబర్ లో ప్రయోగాత్మకంగా కొన్ని స్కూల్స్ లో టిఫిన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఇది విజయవంతం కావడంతో ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరించారు. మొత్తం 15,75,900 మంది పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

First Published:  25 Aug 2023 6:35 AM GMT
Next Story