Telugu Global
National

సిబ్బంది కొరతే రైల్వే కొంప ముంచిందా..?

భారత రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం స్వయానా రైల్వే శాఖ చెప్పిందే. ఈ ఏడాది జనవరిలో సిబ్బంది కొరతపై మీడియాలో ప్రముఖంగా వార్తలొచ్చాయి.

సిబ్బంది కొరతే రైల్వే కొంప ముంచిందా..?
X

భారత రైల్వే సిబ్బంది కొరతతో అల్లాడిపోతోంది. ఇటీవల రైల్వే యూనియన్లు సమ్మెకు సిద్ధపడటానికి కూడా ఇదే ప్రధాన కారణం. కానీ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ ఫాలో అయితే మాత్రం అసలు భారత రైల్వే భూలోక స్వర్గం అనే రేంజ్ లో ఉంటుంది బిల్డప్. రైల్వేల సుందరీకరణపై పెట్టిన శ్రద్ధ, ప్రమాదాల నియంత్రణ, రక్షణ చర్యలపై పెట్టలేదనే విషయం సుస్పష్టం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సందర్భంగా మరోసారి రైల్వేలో సిబ్బంది కొరత అనే విషయం చర్చకు వచ్చింది. సిబ్బంది కొరతపై మీడియాలో వచ్చిన ఆర్టికల్ తో ఉన్న ట్వీట్ ని తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆ విషయాన్ని హైలెట్ చేశారు.


భారత రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం స్వయానా రైల్వే శాఖ చెప్పిందే. ఈ ఏడాది జనవరిలో సిబ్బంది కొరతపై మీడియాలో ప్రముఖంగా వార్తలొచ్చాయి. ఐదు నెలలు గడిచే సరికి దేశంలోనే అతి పెద్ద ప్రమాదం జరిగింది. సిబ్బంది నియామకం చేపట్టకుండా, ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచేసి చేతులు దులుపుకుంటున్న ఉన్నతాధికారులు, రైల్వే మంత్రిత్వ శాఖపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు రైల్వేలో ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన విభాగాల్లో కూడా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ఈ గణాంకాలు బయటపడేవి. కానీ ఆ తర్వాత రైల్వే శాఖ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకునేది. బాధితులకు నష్టపరిహారంతోపాటు కంటితుడుపు చర్యలు చేపట్టేది. ఈసారి కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారా, లేక ప్రమాదాల నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటారా.. తగినంత సిబ్బందిని నియమించుకుని, ఉన్నవారిపై ఒత్తిడి తగ్గిస్తారా..? వేచి చూడాలి.

First Published:  3 Jun 2023 10:18 AM GMT
Next Story