Telugu Global
National

నేటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కీలక బిల్లులపై స్పష్టత ఇవ్వని కేంద్ర సర్కారు!

ప్రత్యక పార్లమెంట్ సెషన్స్ కోసం విడుదల చేసిన అజెండాపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఆయా బిల్లుల కోసమే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి.

నేటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కీలక బిల్లులపై స్పష్టత ఇవ్వని కేంద్ర సర్కారు!
X

నేటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్న ఈ సమావేశాలు.. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో మిగిలిన సెషన్లు కొనసాగిస్తారని ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీలు స్పష్టం చేశారు. రాజ్యంగ సభ మొదలుకొని 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై తొలి రోజు చర్చ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన అజెండాలో పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అజెండాపై విపక్షాలు విమర్శలు చేశాయి. మోడీ సర్కారు ఏదో రహస్య అజెండాను పెట్టుకొని ఉండొచ్చునని.. సమావేశాల్లో ఆకస్మికంగా కొన్ని బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నాయి.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండాను వెల్లడించారు. దీని ప్రకాకం లోక్‌సభలో అడ్వకేట్స్ (సవరణ) బిల్లు-2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్ బిల్లు - 2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు - 2023, ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారులు (నియామకం, సర్వీస్ నిబంధనలు) బిల్లు - 2023ను ప్రవేశ పెడతారు. ఇక రాజ్యసభలో రిపీలింగ్ అండ్ అమెండ్‌మెంట్ బిల్లు - 2023, పోస్టల్ బిల్లు, ఎన్నికల అధికారులకు సంబంధించిన బిల్లులను ఆమోదం కోసం పంపుతారు.

ప్రత్యక పార్లమెంట్ సెషన్స్ కోసం విడుదల చేసిన అజెండాపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఆయా బిల్లుల కోసమే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. వాటిని వింటర్ సెషన్‌లో అయినా ఆమోదింప చేసుకునే అవకాశం ఉన్నదని.. అవేవీ అత్యవసర బిల్లులు కూడా కాదని అంటున్నాయి. కేంద్ర ప్రకటించిన అజెండా అసలు నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానిస్తున్నాయి.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఏదో జరగబోతోందని.. కేంద్ర కేబినెట్ మంత్రులకైనా ఈ విషయం తెలిస్తే కనీసం ఏదో విధంగా లీక్ అయ్యేవి. కానీ గుట్టు చప్పుడు కాకుండా, గతంలో నోట్ల రద్దు విషయంలో ఎలాంటి సీక్రసీ మెయింటైన్ చేశారో అలా చేస్తున్నారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. రహస్య అజెండా ఏంటనేది ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు మాత్రమే తెలుసని.. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల వ్యవధి లేకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుతున్నదని అంటున్నాయి.

ఇండియా పేరు మార్పు, జమిలీ ఎన్నికలు లేదంటే ముందస్తు ఎన్నికలపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి పౌర స్మృతిపై ప్రకటన ఏమైనా చేస్తారా అని విపక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై రాజకీయా పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు.

First Published:  18 Sep 2023 2:04 AM GMT
Next Story