Telugu Global
National

అజెండా ఏంటి..? మోదీకి సోనియా లేఖ

ఈనెల 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో, చివరి మూడు రోజులు కొత్త భవనంలో జరుగుతాయి. అంటే పాత భవనంలో ఇవే చివరి సమావేశాలు, కొత్త భవనంలో ఇవే మొదటి సమావేశాలు కూడా.

అజెండా ఏంటి..? మోదీకి సోనియా లేఖ
X

ఈనెల 18నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్ కూడా ప్రకటించింది. కానీ అజెండాపై మాత్రం దాటవేసింది. సహజంగా పార్లమెంట్ సమావేశాల సందర్భంలో అసలు అజెండా ఏంటి..? ఏయే అంశాలపై చర్చిస్తారనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తారు. కానీ ఈసారి అంతా గుంభనంగా జరుగుతోంది.

పుకార్లు షికార్లు..

జమిలి ఎన్నికలకోసం కమిటీ వేయడంతో, అసలు పార్లమెంట్ సమావేశాల అజెండా కూడా అదేనంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇండియా పేరు భారత్ గా మార్చే అంశం కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. మహిళా బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. సభ్యులందరితో గ్రూప్ ఫొటోకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అంటే.. ఇవే చివరి సమావేశాలు కావొచ్చనే పుకార్లు కూడా గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం నోరు మెదపడంలేదు. అధికారికంగా అజెండా ఇదీ అంటూ చెప్పడంలేదు. దీనిపై ఇన్నాళ్లూ మీడియా ముందు ప్రశ్నించిన విపక్షాలు ఇప్పుడు నేరుగా మోదీనే ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్ఫష్టత ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

పాత పార్లమెంట్ భవనంలో ఇవే చివరి సమావేశాలు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈనెల 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో, చివరి మూడు రోజులు కొత్త భవనంలో జరుగుతాయి. అంటే పాత భవనంలో ఇవే చివరి సమావేశాలు, కొత్త భవనంలో ఇవే మొదటి సమావేశాలు కూడా. ప్రత్యేక సమావేశాల నిర్వహణ అజెండాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించినా ఇంకా కేంద్రం మౌనం వీడలేదు. మొత్తమ్మీద జమిలి హడావిడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  6 Sep 2023 7:36 AM GMT
Next Story