Telugu Global
National

హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్న సోనియా.. అశోక్ గెహ్లాట్ కి పార్టీ బాధ్యతల అప్పగింత ..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షలు, ట్రీట్ మెంట్ కోసం త్వరలో విదేశాలకు వెళ్తున్నందున ఆ సమయంలో పార్టీ బాధ్యతలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కు అప్పగిస్తున్నట్టు సమాచారం.

హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్న సోనియా.. అశోక్ గెహ్లాట్ కి పార్టీ బాధ్యతల అప్పగింత ..?
X

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఆశావహులకు ఇదో షాకింగ్ న్యూస్ ! ఈ అత్యున్నత పదవికి రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బెస్ట్ ఛాయిస్ అని అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్టు తాజా సమాచారం.. ఆరోగ్య పరీక్షలు, ట్రీట్ మెంట్ కోసం త్వరలో విదేశాలకు వెళ్తున్నందున.. తాను లేని సమయంలో పార్టీ బాధ్యతలు చూడాలని ఆమె గెహ్లాట్ కి సూచించినట్టు తెలిసింది. అంతర్గతంగా జరిగిన సమావేశంలో ఆమె ఈ సూచన చేశారని, అయితే దీనిపై గెహ్లాట్ మౌనం వహించారని తెలుస్తోంది. ఆయన వర్గం దీన్ని ధృవీకరించనప్పటికీ.. ఈ పదవికి గాంధీ కుటుంబం నుంచి కాక.. సమర్థులైన ఇతర నేతలెవరినైనా నియమించాలని పార్టీ యోచిస్తున్నదట. దేశంలో నేను లేనప్పుడు పార్టీ పగ్గాలు తీసుకోవాలని సోనియా గెహ్లాట్ ని కోరడం చూస్తే కాంగ్రెస్ సారధి ఆయన కావడం తధ్యమన్న మాట వినిపిస్తోంది. పైగా సెప్టెంబరు 20 లోగా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఇదివరకే నిర్ణయించారు. ఆ తేదీని దాటి మరింత జాప్యం చేయరాదని సోనియా అప్పుడే షెడ్యూల్ రూపకల్పనలో బిజీగా ఉంటున్నారు. కొత్త అధ్యక్షుని ఎన్నికకు సంబంధించిన కార్యాచరణ ప్రక్రియను ప్రకటించే విషయంలో పార్టీ వర్కింగ్ కమిటీ నుంచి ఆమోదం కోసం సెంట్రల్ ఎలెక్షన్ అథారిటీ కమిటీ వేచి చూస్తోంది.

అధ్యక్ష పదవిని చేబట్టేందుకు రాహుల్ గాంధీ నిరాకరించడంతో.. అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఈ పోస్టుకు ఎంచుకోవడం కష్ట సాధ్యమైన పనే .. అయితే రాహుల్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని.అశోక్ గెహ్లాట్ పదేపదే కోరుతున్నారు. . మీరు ఈ పదవిని నిరాకరించడం పార్టీ శ్రేణులను నైరాశ్యానికి గురి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇటీవలే సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ తమ చర్యలతో పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. జీ-23 అసమ్మతి నేతల లేఖ రగిల్చిన వివాదం ఇంకా ఇప్పటికీ మండుతూనే ఉంది. అందుకే సెప్టెంబరులో వీలైనంత త్వరగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలన్నది పార్టీ యోచనగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు అశోక్ గెహ్లాట్ పట్ల నేతల్లో చాలామందికి వ్యతిరేకత లేదు. కానీ చిదంబరం, శశిథరూర్ వంటి సీనియర్లు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం సందేహాలకు తావిస్తోంది. పైగా పార్టీ అధ్యక్ష పదవిని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ కూడా ఆశిస్తున్నారు..

ఇదే సమయంలో సోనియా అధ్యక్ష పదవిలోనే కొనసాగాలని, ప్రతి జోన్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్టు తెలిసింది. సోనియా వెంట విదేశాలకు రాహుల్, ప్రియాంక గాంధీ కూడా వెళ్లనున్నారని, అందువల్లే అశోక్ గెహ్లాట్ కి తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నారని సమాచారం.


.

First Published:  24 Aug 2022 7:34 AM GMT
Next Story