Telugu Global
National

సోనాలీ ఫోగ‌ట్ కేసు సీబీఐకి!

టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హ‌త్య కేసు విచార‌ణ‌ను సీబీఐ అప్పగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది.

సోనాలీ ఫోగ‌ట్ కేసు సీబీఐకి!
X

టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హ‌త్య కేసు విచార‌ణ‌ను సీబీఐ అప్పగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో పాటు సోనాలి ఫోగ‌ట్‌ కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. ఫోగట్‌ కుటుంబం సీబీఐ దర్యాప్తును డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని ఖ‌ట్ట‌ర్‌ తనతో ప్రస్తావించారని సావంత్ వెల్లడించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే గోవా పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారని పేర్కొన్నారు.

సీబీఐ విచారణకు సావంత్ అధికారికంగా కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు. సీబీఐ విచారణకు స్వీకరిస్తే.. గోవా పోలీసులు ఇప్పటి వరకు చేప‌ట్టిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించే అవకాశం ఉంది.

సోనాలి ఫోగట్‌ గోవాలోని ఓ పబ్‌లో గత సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమెతో బలవంతంగా డ్రగ్స్ తాగించిన‌ట్టు పబ్ సిసి టీవీ ఫుటేజ్ లో కనిపించింది. కెమికల్ డ్రగ్ తీసుకున్న తర్వాత ఆమె నియంత్రణలో లేకపోవడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆమెది సహజ మరణం కాదని, హత్య చేశారంటూ ఆమె కుటుంబీకులు ఆరోపణలు చేయ‌డం, పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలడంతో గోవా పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో తొలుత ఆమె పీఏలు సుఖ్విందర్‌సింగ్‌, సుధీర్‌ సాగ్వాన్‌, క‌ర్లీస్ రెస్టారెంట్ య‌జ‌మాని ఎడ్విన్ న్యూన్స్‌, డ్రగ్‌ పెడ్లర్‌ దత్తప్రసాద్‌ గోంక‌ర్‌ల‌ను అరెస్ట్ చేయగా, ఆదివారం మ‌రో డ్ర‌గ్ పెడ్ల‌ర్ ర‌మా మంద్రేక‌ర్‌ను అరెస్ట్ చేశారు. సోనాలితో సుధీర్‌ సాగ్వాన్‌ బలవంతంగా డ్రింక్‌ తాగించినట్టు సీసీ టీవీ దృశ్యాలు స్పష్టం చేశాయి. సోనాలిపై సుఖ్విందర్‌ సింగ్‌, సుధీర్‌ సాగ్వాన్‌ అత్యాచారం చేసి చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుఖ్విందర్‌సింగ్‌ , సుధీర్‌ సాగ్వాన్‌ ఆమెను హత్య చేశారని, వాళ్లిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోనాలి సొంతూరు హిసార్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె 15 ఏళ్ల కుమార్తె, కుటుంబ సభ్యులు హర్యానా సీఎంను కలిసి దోషులను శిక్షించాలని కోరారు.

సుధీర్ సంగ్వాన్‌, సుఖ్వింద‌ర్ సింగ్‌ల‌ను శ‌నివార‌మే కోర్టులో హాజ‌రుర్చగా కోర్టు ఇద్దరికి 10 రోజుల పోలీస్ క‌స్టడీ విధించింది. మరో ముగ్గురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది కోర్టు. ఎడ్విన్ న్యూన్స్ పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం తోసిపుచ్చింది.

First Published:  29 Aug 2022 6:19 AM GMT
Next Story