Telugu Global
National

'అవినీతి' అన్నా తప్పేనా ? పదాల 'ప్రక్షాళన' పార్లమెంటుకేనా ?

దేశ అత్యున్నత చట్ట సభలో ఇకపై ఎన్నో పదాలమీద వేటు పడినట్టే ! పార్లమెంటులో సభ్యులు నిష్టా గరిష్టుల్లా.. నీతిమంతుల్లా శుభ్రమైన, 'పవిత్రమైన' పరిశుద్ధాత్మతో ప్రసంగించాల్సిందే ! ఆ సభ్యుడిలా, ఈ ప్రభుత్వమిలా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు.

అవినీతి అన్నా తప్పేనా ? పదాల ప్రక్షాళన పార్లమెంటుకేనా ?
X

దేశ అత్యున్నత చట్ట సభలో ఇకపై ఎన్నో పదాలమీద వేటు పడినట్టే ! పార్లమెంటులో సభ్యులు నిష్టా గరిష్టుల్లా.. నీతిమంతుల్లా శుభ్రమైన, 'పవిత్రమైన' పరిశుద్ధాత్మతో ప్రసంగించాల్సిందే ! ఆ సభ్యుడిలా, ఈ ప్రభుత్వమిలా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. 'చెంచా', 'చెంచాగిరి', 'అవినీతి', 'సిగ్గుచేటు', 'నియంత', 'అరాచకవాది', 'శకుని', 'వినాశ్ పురుష్' 'విద్రోహులు' లాంటి మాటలు మాట్లాడినా అవి రికార్డులకెక్కకుండా ఉండిపోతాయి. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ఎలా హుందాగా మాట్లాడాలో, ఎలాంటి పదాలు పలకకూడదో తాజాగా నిర్దేశించారు. ఇలాంటి వాటిని అన్ పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటున్నారు. ఉభయ సభల్లో లేదా అసెంబ్లీల్లో జరిగే చర్చల సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీటి జోలికి వెళ్లకూడదట !

ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ ఓ బుక్ లెట్ వెలువరించింది. ద్రోహ చరిత్ర, నికమ్మా, నౌఠంకీ, బెహ్రీ సర్కార్ లాంటి ఎన్నో పదాలు సైతం ఈ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. గత ఏడాది ఉభయసభల్లో అన్ పార్లమెంటరిగా ప్రకటించిన పదాలను, పదజాలాన్ని ఈ బుక్ లెట్ లో ప్రచురించారు. 2020 లో కొన్ని కామన్ వెల్త్ దేశాల్లో ఈ విధమైన వాటిని అనుమతించలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. బ్లడీ, షిట్, కోవిడ్ స్ప్రెడర్, గద్దార్, అహంకార్, దాదాగిరి, ఛీటెడ్, చైల్డిష్ నెస్, కరప్ట్, హిపోక్రసీ, డాంకీ .. ఇలా బోలెడన్ని పదాలను ఈ లిస్టులో పెట్టారు. ఏమైనప్పటికీ వీటిని అన్ పార్లమెంటరీ పదాలుగా పరిగణించాలా , రికార్డులకెక్కకుండా చూడాలా అన్న విషయమై లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ లదే తుది నిర్ణయమవుతుంది. అలాగే స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ను ఉద్దేశించి ఇంగ్ల్లీష్ లేక హిందీలో ఎలాంటి అనుచిత భాషను వాడినా అది కూడా రికార్డులకెక్కదు. ఈ విధమైన పదాలు ఉభయ సభల రికార్డుల్లో భాగం కాబోవని ఈ బుక్ లెట్ లో వివరించారు. ఈ రెండు భాషల్లోనూ వేర్వేరుగా తిట్టే వర్డ్స్ ని పేర్కొన్నారు.

ఇంతకీ వీటిని రికార్డులకెక్కకూడకుండా చూడాలని ఎవరు ఆదేశించారో గానీ మన చట్ట సభల్లో ఎంపీలు, లేదా ఎమ్మెల్యేల్లో చాలామంది ఈ విధమైనవాటిని వాడుతుండడం కొత్తేమీ కాదు. చర్చల సందర్భంగా పాలక, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు పరస్పర ఆరోపణలతో బాటు అనుచితమైన వ్యాఖ్యలెన్నో చూశాం ! ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు సహజంగానే ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయిన సందర్భాల్లో అన్ పార్లమెంటరీ పదాలు నోటివెంట రావడం సహజం. అలాగే వారిమీద పాలక సభ్యులు విరుచుకపడినప్పుడు కూడా ఇలాగే విమర్శలు చోటు చేసుకుంటాయి.

ఈ బుక్ లెట్ లో అన్ పార్లమెంటరీ పదాల గురించి ప్రస్తావించారు గానీ, లోక్ సభ స్పీకర్ పోడియం వద్దకు లేదా రాజ్యసభలో చైర్మన్ పోడియం వద్దకు సభ్యులు దూసుకుపోవడం,ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం, బల్లలు ఎక్కి కాగితాలను విసిరివేయడం వంటి చర్యలు అన్ పార్లమెంటరీ కాదా అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇప్పటికే భావ ప్రకటనా స్వేచ్చకు కళ్లెం వేసి... ప్రభుత్వ విమర్శకుల మీద పోలీసు కేసులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో కూడా తనకు అనుకూలమైన భాషనే సభ్యులు వాడాలన్న నియమం పెట్టుకుందా ? విపక్షాల నోరు నొక్కేందుకే ఈ తాజా చర్య తీసుకుందా ? చైల్డిష్ (బాల్యచేష్ట) అన్న పదం కూడా బూతే అయిందా ? మరి పాలక సభ్యులు ఇలాంటి మాటలు మాట్లాడినా వాటికీ పవిత్రత సోకుతుందనుకోవాలా ? త్వరలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ విధమైన పదాలు వాడకుండా ఎంతమంది సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే !

First Published:  14 July 2022 4:52 AM GMT
Next Story