Telugu Global
National

''సుప్రీంకోర్టు పరువు ప్రతిష్ఠల్ని కొందరు జడ్జీలే దెబ్బతీస్తున్నారు''

కార్పోరేట్ కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు వ్యవహరిస్తోందని సుప్రీ‍ం కోర్టు సీనియర్ అడ్వకేట్ దవే ఆరోపించారు. ప్రజలకు న్యాయం అందించడంలో 'సుప్రీం' వైఫల్యాల పై ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు పరువు ప్రతిష్ఠల్ని కొందరు జడ్జీలే దెబ్బతీస్తున్నారు
X

సుప్రీంకోర్టు పరువు ప్రతిష్ఠల్ని కొందరు జడ్జీలే దెబ్బతీస్తున్నారని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. న్యాయం అందించడంలో సుప్రీంకోర్టు వైఫల్యాల గురించి దేశ ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు.


సుప్రీంకోర్టులో కొన్ని కార్పోరేట్ సంస్థలకు సంబంధించిన కేసులు వాళ్లకు అనుకూలంగా తీర్పులిచ్చే బెంచీలకే వెళ్తున్నాయని విమర్శించారాయన. సుప్రీంకోర్టు దాకా వచ్చిన కార్పోరేట్ సంస్థల కేసుల్లో 90 శాతం పైగా తీర్పులు కార్పోరేట్లకు అనుకూలంగా ఉంటున్నాయని... ఇదేం సూచిస్తుందని ప్రశ్నించారు దవే.


కొందరు జడ్జీల వల్ల మిగిలిన వారి ప్రతిష్ఠ దెబ్బతింటున్న విషయాన్ని సహచర జడ్జీలు గుర్తించాలన్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచికే ఈ దేశంలో అతి పెద్ద కార్పోరేట్ సంస్థకు సంబంధించిన తొమ్మిది కేసులు వెళ్లాయని, ఆ సంస్థకు చెందిన ఐదు కేసుల్లో అప్పటి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ తీర్పులిచ్చారని, ఆ తర్వాత జరిగిన గొగోయ్ ఫుస్తకావిష్కరణ సభకు ఆ కార్పోరేట్ సంస్థ అధిపతిని కుటుంబంతో సహా గొగోయ్ ఆహ్వానించడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని దవే ప్రశ్నించారు.


ఏ ఏ కేసులను ఏ ఏ బెంచీలకు కేటాయించాలన్న అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉండకూడదని, కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిక్ గా జరిగినప్పుడే తీర్పుల్లో పక్షపాతానికి అవకాశం ఉండదని దవే సూచించారు.




First Published:  12 Aug 2022 8:33 AM GMT
Next Story