Telugu Global
National

బీజేపీ వ్యతిరేకులపై కక్ష సాధింపు....తీస్తా సెతల్వాద్ పై సిట్ కొత్త ఆరోపణలు

మమ్మల్ని తిడితే కేసు పెట్టి లోపలేస్తాం.. ఎన్నయినా ఆరోపణలు చేస్తాం.. బయటికిరాకుండా జైల్లోనే ఉంచేస్తాం.. తడాఖా చూపుతాం.. ఇదీ ఇప్పటి మోడీ ప్రభుత్వ తీరు ! ఇందుకు నెల తిరిగేసరికి జీతాలు తీసుకుంటున్న పోలీసులు సైతం తలొగ్గక తప్పదు !

బీజేపీ వ్యతిరేకులపై కక్ష సాధింపు....తీస్తా సెతల్వాద్ పై సిట్ కొత్త ఆరోపణలు
X

మమ్మల్ని తిడితే కేసు పెట్టి లోపలేస్తాం.. ఎన్నయినా ఆరోపణలు చేస్తాం.. బయటికిరాకుండా జైల్లోనే ఉంచేస్తాం.. తడాఖా చూపుతాం.. ఇదీ ఇప్పటి మోడీ ప్రభుత్వ తీరు ! ఇందుకు నెల తిరిగేసరికి జీతాలు తీసుకుంటున్న పోలీసులు సైతం తలొగ్గక తప్పదు ! మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడో కాదు.. ఇక్కడే.. ఈ దేశంలోనే జరుగుతోంది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ విషయంలో ఇదే జరుగుతోంది. గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆమె కుట్ర పన్నారట ! ఇలా అని ఆ రాష్ట్ర 'సిట్' పోలీసులు కొత్త అభియోగాన్ని మోపారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ నుంచి ఆమె లోగడ 30 లక్షలు తీసుకున్నారని వీళ్ళు అహ్మదాబాద్ కోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఆమె మొదట తొలి విడతగా 5 లక్షలు, ఆ తరువాత 25 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. కావాలంటే ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారని, వారి వాంగ్మూలాలను నమోదు చేశామని చెబుతున్నారు. సాక్షులదేం ఖర్మ ! ఓ కేసులో ఇలా నువ్వు చెప్పాలని ఒత్తిడి చేస్తే సదరు వ్యక్తి చెప్పాల్సిందే ! సాక్ష్యాధారాలన్నవి అసలైన డాక్యుమెంట్లలో ఉండాలి.. అవి బోగస్ పత్రాలా , నిజమైనవా అని కోర్టులు నిర్ధారించాలి. కానీ ఇక్కడ తీస్తా సెతల్వాద్ విషయంలో ఇప్పటివరకు చెప్పని పోలీసులు ఈ కొత్త ఆరోపణ చేశారంటే.. ఆమెను కొంతకాలం తప్పనిసరిగా జైలుకు పంపాలన్నదే ! ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని సవాలు చేస్తూ సిట్ పోలీసులు ఈ అఫిడవిట్ ని సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్ పటేల్ సూచనతో తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బీ.శ్రీకుమార్ ..ఎట్టి పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచి గద్దె దింపాలన్న భారీ కుట్రకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. ఇందులో క్రిమినల్ కుట్రతో బాటు ఫోర్జరీ చేశారన్న ఆరోపణ కూడా ఉంది. గుజరాత్ లో 2002 లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను 'నిందితులు' తారుమారు చేయడానికి యత్నించారట. అహ్మద్ పటేల్ ని తీస్తా సెతల్వాద్ చాలాసార్లు కలిశారని, డబ్బులు తీసుకున్నారని పోలీసులు ఈ అఫిడవిట్ లో వివరించారు. ప్రత్యర్థి పార్టీ (కాంగ్రెస్) నుంచి ఆమె చట్టవిరుద్ధంగా సొమ్ములు,ఇతర ప్రయోజనాలు పొందారని అన్నారు. పైగా నాటి అల్లర్ల బాధితులకు సహాయం చేయడానికి ఈ సొమ్మును తీస్తా, శ్రీకుమార్ వాడలేదని కూడా అన్నారు. దీన్ని సాయానికి సంబంధించిన కార్పస్ ఫండ్ లో జమ చేశారనడానికి ఆధారాలు లేవన్నారు. ఈ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ప్రమేయాన్ని కూడా చేర్చారు. అసలు తీస్తా సెతల్వాద్ మీద ఇంత కసికి కారణమొకటుంది. ఈ కేసులో నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నించడమే., దాన్ని పట్టుకుని.. ఆమె సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ప్రయత్నించారని కేసు పెట్టారు. ఈ కేసులో తన వెర్షన్ చెప్పడానికి అహ్మద్ పటేల్ లేరు.. ఆయన 2020 నవంబరులోనే కరోనాతో మరణించారు. ఇక- తనను రాజ్యసభకు ఎంపిక చేయకుండా షబానా అజ్మీ, జావేద్ లను ఎందుకు ఎంపిక చేశారని తీస్తా సెతల్వాద్ 2006 లో కాంగ్రెస్ నేతలను ప్రశ్నించినట్టు సాక్షులు చెప్పారని.. ఈ కేసుకు కొత్త పొలిటికల్ కలరింగ్ ఇచ్చేందుకు కూడా సిట్ పోలీసులు యత్నించారు.

గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషీ.. ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందోనని ఈ వ్యవహారంపై మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసు పూర్వాపరాలు తనకు పూర్తిగా తెలియవని, తెలిసాక స్పందిస్తానని చెప్పారు. పోలీసుల అఫిడవిట్ పై స్పందించిన అదనపు సెషన్స్ జడ్జి డీ.డీ.థక్కర్.. దీన్ని కూలంకషంగా పరిశీలిస్తానని చెబుతూ ... తీస్తా బెయిల్ పిటిషన్ మీద సోమవారం విచారణ జరుగుతుందని ప్రకటించారు.

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సెతల్వాద్ పద్మశ్రీ అవార్డు పొందారా ?

గుజరాత్ లో నాటి సీఎం మోడీ సర్కార్ ని గద్దె దింపేందుకు చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలంగా 2007 లో తీస్తా సెతల్వాద్ కి అప్పటి ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చిందని, ఎలాగైనా రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు ఆమె యత్నించారని ..ఇలా చాలా ఆరోపణలను సిట్ పోలీసులు ఆమెపై మోపారు. అయితే జర్నలిస్టు కూడా అయిన ఈమె అరెస్టు అక్రమమని ఐరాస మానవహక్కుల విభాగం కూడా తప్పు పట్టింది. మోడీపై న్యాయపోరాటం జరిపితే ఆమెపై కక్ష సాధిస్తారా అని ఈ విభాగం అధికారి మేరీ లాలర్ లోగడ తీవ్రంగా ప్రశ్నించారు.






First Published:  16 July 2022 6:19 AM GMT
Next Story