Telugu Global
National

ఇప్పటి వరకు ఏమి తినాలో చెప్పారు.. ఇక ఏమి రంగులు వాడాలో చెప్తున్నారు

ఈ మధ్య రెండు సంఘటనలు జరిగాయి. రెండు కూడా కాషాయ, ఆకుపచ్చ రంగులకు సంబంధించిన రచ్చనే. ఒకటి పఠాన్ అనే హిందీ మూవీకి సంబంధించిందైతే మరొకటి కర్నాటక‌లోని ఓ రైల్వే స్టేషన్ కు సంబంధించింది.

ఇప్పటి వరకు ఏమి తినాలో చెప్పారు.. ఇక ఏమి రంగులు వాడాలో చెప్తున్నారు
X

మనమేం తినాలో, ఏ దుస్తులు ధరించాలో, ఏ భాష మాట్లాడాలో ఫత్వాలు జారీ చేస్తున్న‌ హిందుత్వ సంఘాలు ఇప్పుడు ఏ రంగు వాడాలో, ఏ రంగు వాడకూడదో కూడా నిర్ణయించేశాయి. తాజాగా జరిగిన రెండు సంఘటనల్లో బీజేపీ మద్దతుతో హిందుత్వ‌ సంఘాలు చేస్తున్న రంగుల రచ్చ దేశ‌వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

ఈ మధ్య రెండు సంఘటనలు జరిగాయి. రెండు కూడా కాషాయ, ఆకుపచ్చ రంగులకు సంబంధించిన రచ్చనే. ఒకటి పఠాన్ అనే హిందీ మూవీకి సంబంధించిందైతే మరొకటి కర్నాటక‌లోని ఓ రైల్వే స్టేషన్ కు సంబంధించింది.

Advertisement

కర్నాటకలోని కలబురిగి రైల్వే స్టేషన్ కు ఈ మధ్య‌ అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు. ఆకు పచ్చ రంగును చూసిన పలు హిందూ సంఘాలకు ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. వేస్తే కాషాయ రంగు వేయాలి కానీ ఆకుపచ్చ రంగు ఎలా వేస్తారంటూ వందల మంది రోడ్డెక్కారు. ఊరేగింపులు తీశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. మీరు రంగు మారుస్తారా లేక మేమే కాషాయ రంగు వేయాలా అంటూ రైల్వే అధికారులను హెచ్చరించారు.

నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న లక్ష్మీకాంత సాధ్వి అనే ఓ హిందుత్వ‌ కార్యకర్త మాట్లాడుతూ రైల్వే స్టేషన్ భవనానికి ఆకుపచ్చ రంగు కాకుండా వేరే ఏదైనా రంగు వేయాలి. ఒక వేళ వాళ్ళు రంగు మార్చకపోతే మేమే రైల్వే భవనానికి కాషాయ రంగు వేస్తాము". అని హెచ్చరించారు.

Advertisement

అధికార బీజేపీ మద్దతుతోనే హిందుత్వ సంఘాలు ఈ రంగు రచ్చ మొదలు పెట్టాయి. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే. ఇక వాళ్ళకు అడ్డేమున్నది. ఆగమేఘాల మీద పైనుంచి ఆర్దర్స్ వచ్చేశాయి. వెంటనే ఈ నెల 13 వ తేదీన రైల్వే స్టేషన్ బిల్డింగులకు వేసిన గ్రీన్ కలర్ పై తెల్ల రంగు వేసేశారు.

ఇది ఆకుపచ్చరంగు రచ్చైతే మరోటి కాషాయ రంగు రచ్చ. త్వరలో షారూక్ ఖాన్ , దీపికా పదుకొనే నటించిన పఠాన్ అనే మూవీ రాబోతుంది. అందులో ఓ పాటలో దీపిక బట్టలు ఉండీ లేనట్టు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంది. అందులోనూ ఓ సారి కాషాయ బట్టలు కూడా వేసుకుంది.

అసలే హీరో ముస్లిం, హీరోయిన్ గతంలో ఒక సారి.. బీజేపీ నాయకుల భాషలోనే చెప్పాలంటే JNU కు చెందిన తుక్డే తుక్డే గ్యాంగ్ కు సపోర్ట్ చేసింది. దాంతో మొదలయ్యింది కాషాయ రంగు రచ్చ.

ఇక్కడ దీపిక వేసుకున్న తుక్డే తుక్డే దుస్తులకన్నా ఆమె తుక్డే తుక్డే గ్యాంగుకు ఇచ్చిన మద్దతే హిందుత్వ సంఘాల అసలు కోపానికి కారణం. ఈ అంశంపై ఊరేగింపులు తీశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. సోషల్ మీడియాలో 'బ్యాన్ పఠాన్' అనే హ్యాష్ ట్యాగ్ తో ఓ ఉద్యమమే మొదలు పెట్టారు.

దీనిపై మధ్యప్రదేశ్ హోం శాఖా మంత్రి, బీజేపీ నాయకుడు నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ ''పఠాన్ మూవీలో 'బేషరం రంగ్' అనే పాటలో దీపికా పదుకొనే కాషాయ రంగులో ఉన్న అభ్యంతరకర దుస్తులు వేసుకుంది. పాట టైటిల్, రంగు రెండూ అభ్యంతరకరమే. ఇది సిగ్గు లేని తనం. దీపికి పదుకునే గతంలో JNU కు చెందిన తుక్డే తుక్డే గ్యాంగ్ కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు కాషాయ దుస్తులు ధరించి అభ్యంతరకరంగా నటించింది. దర్శకుడు, నిర్మాత దీన్ని సరిచేయకపోతే మధ్యప్రదేశ్ లో మూవీ విడుదల గురించి మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది.'' అని హెచ్చరించారు

ఆర్‌ఎస్‌ఎస్ సభ్యురాలు, వీహెచ్‌పీ నాయకురాలు డాక్టర్ ప్రాచీ సాధ్వి ఈ చిత్రాన్ని నిషేధించాల‌ని డిమాండ్ చేశారు..

''బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొనె కాషాయ దుస్తులు ధరించి, చౌకబారు అసభ్యకర చర్యలకు పాల్పడినట్లు చూపారు. బాలీవుడ్ ఉద్దేశపూర్వకంగా మా హిందూమతాన్ని, మా రంగును ఎగతాళి చేస్తోంది. షారూక్ ఖాన్ ఆకుపచ్చ దుస్తులు ధరించాడు. ఇది కూడా లవ్ జీహాదీ యొక్క రహస్య ఎజెండా" అని మరొక హిందుత్వ వాది ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.

ఇక్కడ కాషాయ దళాలకు ఈ మూవీలో దీపిక పదుకొనే వేసుకున్న పొట్టి దుస్తులు కానీ, ఈ మధ్య వస్తున్న అనేక సినిమాల్లో హీరోయిన్లను చూపిస్తున్న తీరు కానీ అభ్యంతర కరం కానే కాదు. ఆమె ధరించిన పొట్టి దుస్తులకు ఉన్న కాషాయ రంగు, షారూక్ ఖాన్ ధరించిన ఆకుపచ్చ దుస్తులు...ఇవీ వారికి అభ్యంతరకరమైనవి.

ఇప్పటి వరకు ఈ దేశ ప్రజలు ఏం మాట్లాడాలో, ఏ దేవుణ్ణి పూజించాలో, ఏ దుస్తులు వేసుకోవాలో, ఏ ఆహారం తీసుకోవాలో, ఎవరికి జై కొట్టాలో, ఎవరికి నైకొట్టాలో ఫత్వాలు జారీ చేసిన ఈ మత సంస్థలు, వారికి మద్దతుగా నిలబడ్డ బీజేపీ నాయకులు ఇప్పుడు రంగుల మీదపడ్డారు. రేపు రేపు ఆకుపచ్చగా ఉన్నందుకు చెట్ల‌ను, ఎరుపుగా ఉన్నందుకు సూర్యుడిని, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్నందుకు ఇంద్రధనస్సును నిషేధించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Next Story