Telugu Global
National

స్మైల్‌ ప్లీజ్ విక్రమ్.. విక్రమ్ ల్యాండర్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్

తనను జాబిల్లి మీదకి తీసుకువెళ్లిన ల్యాండర్ ఫొటోలను రోవర్ తీసింది. ఇస్రో ఆ ఫొటోలను షేర్ చేస్తూ సరదాగా స్మైల్ ప్లీజ్ విక్రమ్ అని రాసింది.

స్మైల్‌ ప్లీజ్ విక్రమ్.. విక్రమ్ ల్యాండర్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్
X

ఇస్రో ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం చంద్రుడి మీద అటు ఇటు తిరుగుతూ ఫొటోలు షూట్ చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ ను ఫొటో తీసింది. రోవర్ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి.

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌కు సంబంధించిన చిత్రాలను ఇస్రో ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎక్స్(ట్విట్ట‌ర్) ద్వారా పోస్ట్ చేస్తోంది. తాజాగా తనను జాబిల్లి మీదకి తీసుకువెళ్లిన ల్యాండర్ ఫొటోలను రోవర్ తీసింది. ఇస్రో ఆ ఫొటోలను షేర్ చేస్తూ సరదాగా స్మైల్ ప్లీజ్ విక్రమ్ అని రాసింది. ఈ మిషన్ యొక్క చిత్రాన్ని రోవర్ తన నావ్‌కామ్ ద్వారా తీసిందని తెలిపింది. చంద్రయాన్-3 కోసం నావ్‌కామ్‌ను ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్(ఎల్ఈఓఎస్) అభివృద్ధి చేసింది.


ఆ ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కు చెందిన రెండు పేలోడ్స్ ChaSTE, ILSA స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వారం ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫొటోలను, వీడియోను ఇస్రో షేర్ చేసింది. ఆ తరువాత చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫొటోలను, వీడియోను షేర్ చేసింది కానీ, చంద్రుడి ఉపరితలంపై నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ఫొటోను షేర్ చేయడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉంటే.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ పలు మూలకాల మిశ్రమాలను గుర్తించింది. మూలకాలను పరిశోధించేందుకు ప్రజ్ఞాన్ రోవర్‌లో లేజర్-ఇండ్యుసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (LIBS) పరికరాన్ని అమర్చిన విషయం తెలిసిందే. దీనిని బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్‌లో అభివృద్ధి చేశారు. దాని ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అల్యూమినియం, సల్ఫర్ , కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం ఉన్నట్లు తేల్చామని ఇస్రో తెలిపింది. అలాగే, మరికొన్ని గణాంకాల ద్వారా మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ ఉనికి ఉన్నట్లు గుర్తించామని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం హైడ్రోజన్ ఉనికి గురించి పరిశోధన జరుగుతోందని చెప్పింది.

*

First Published:  30 Aug 2023 9:50 AM GMT
Next Story