Telugu Global
National

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. - ఆరుగురు మృతి

పేలుళ్ల తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న పదుల సంఖ్యలో ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపించినట్టు సమాచారం.

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. - ఆరుగురు మృతి
X

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభ‌వించి ఆరుగురు మృతిచెందిన ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని హర్దా పట్టణంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో బయటికి రాలేక మరికొంతమంది లోపలే చిక్కుకుపోయి ఉండొచ్చని తెలుస్తోంది. పేలుళ్ల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు.

ఊహించనివిధంగా జరిగిన ఈ ఘటన స్థానికులకు తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న పేలుళ్ల తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న పదుల సంఖ్యలో ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపించినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ స్పందించారు. తక్షణ సహాయక‌ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలను అదుపులోకి తెస్తున్నామని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తే.. లోపల ఎక్కువమందే చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

First Published:  6 Feb 2024 10:00 AM GMT
Next Story