Telugu Global
National

ఆరుగురు డిప్యూటీ సీఎంలు.. కర్నాటకలో కాకమీదున్న కాంగ్రెస్ రాజకీయం

అధిష్టానం మౌనాన్ని మరికొందరు అలుసుగా తీసుకుంటున్నారు. సిద్ధరామయ్యపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇలాంటి వారందర్నీ సముదాయించేందుకే ఇప్పుడు ఆరుగురు డిప్యూటీ సీఎంల ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఆరుగురు డిప్యూటీ సీఎంలు.. కర్నాటకలో కాకమీదున్న కాంగ్రెస్ రాజకీయం
X

కర్నాటకలో సీఎం కుర్చీ సర్దుబాటు సంతోషం కాంగ్రెస్ లో ఎక్కువకాలం ఉండేలా లేదు. అప్పుడే పార్టీలో ముసలం పుట్టింది, సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పులు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సమస్య లేనట్టే కనిపిస్తున్నా మిగతా నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈ దశలో అన్ని వర్గాలను సంతృప్తి పరచేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏకంగా ఆరు డిప్యూటీ సీఎం పోస్ట్ లను సృష్టిస్తోంది. డీకేతో కలిపి మొత్తం ఆరుగురు డిప్యూటీ సీఎంలు కర్నాటకలో ఉంటారు. త్వరలో ఈ నియామకాలు జరుగుతాయని, 2024 లోక్ సభ ఎన్నికల లోపు అక్కడ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా అధిష్టానం ఆలోచిస్తోందని అంటున్నారు నేతలు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి డిప్యూటీ సీఎంల వ్యవహారాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం డీకే శివకుమార్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకు తోడుగా మరో ఐదుగురిని డిప్యూటీలుగా నియమించేందుకు అధిష్టానం ఆలోచనలు చేస్తోందని అన్నారాయన. దీంతో గందరగోళం నెలకొంది. బీజేపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో నాయకులెవరూ నోరు జారొద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

సీఎం పక్కలో బల్లెం హరిప్రసాద్..

మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ కూడా సీఎం సిద్ధరామయ్యపై రగిలిపోతున్నారు. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా హరిప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఓబీసీ వర్గాలతో సమావేశమై సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ప్రసంగాలిస్తున్నారు. ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లినా ఏమీ చేయలేని పరిస్థితి. హరిప్రసాద్ సీనియర్ కావడం, ఆయన సామాజిక వర్గం నేతల్లో చాలామంది మద్దతు ఆయనకే ఉండటంతో క్రమశిక్షణ చర్యలకు వేచి చూస్తోంది అధిష్టానం. సిద్ధరామయ్య ఫిర్యాదులను కూడా పక్కనపెట్టింది. అధిష్టానం మౌనాన్ని మరికొందరు అలుసుగా తీసుకుంటున్నారు. సిద్ధరామయ్యపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇలాంటి వారందర్నీ సముదాయించేందుకే ఇప్పుడు ఆరుగురు డిప్యూటీ సీఎంల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎన్నికల తర్వాత డీకే రూపంలో అపాయం ఉన్నా తెలిగివిగా తప్పించుకున్న సిద్ధరామయ్యకు, మిగతా అసంతృప్తులతో కొత్త తలనొప్పి మొదలైంది.


First Published:  25 Sep 2023 9:34 AM GMT
Next Story