Telugu Global
National

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత క్రిస్టియన్లు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమూ నేరమా?

ఉత్తరప్రదేశ్ లోకుమారుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న ఓ దళిత క్రిస్టియన్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత మార్పిడిలకు పాల్పడుతున్నారంటూ ఆరుగురు మహిళలను జైలుకు పంపారు. ఇదంతా VHP నాయకుల పిర్యాదుతో జరిగింది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత క్రిస్టియన్లు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమూ నేరమా?
X

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలో మహేంద్ర కుమార్, ఇంద్ర కాలా దంపతుల కుమారుడి పుట్టిన రోజు వేడుకలను వాళ్ళింట్లో జరుపుకుంటున్నారు. ఆ వేడుకలకు వారి బంధు, మిత్రులను కూడా ఆహ్వానించారు. వాళ్ళంతా దళిత క్రిస్టియన్లు. కేకు కట్ చేయడానికి ముందు వాళ్ళు ప్రార్దనలు చేశారు. అది వాళ్ళు చేసిన అతి పెద్ద నేరం. ఇటువంటి సమయం కోసం కాచుకొని ఉండే శక్తులువెంటనే కార్యక్రమం రూపొందించాయి.

అదే ఏరియాలో ఉండే విశ్వహిందూ పరిషత్ (VHP) బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అశుతోష్‌ సింగ్ ఇక్కడ బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని పోలీసులకు ఫోన్ చేశాడు. ఇటువంటి సమాచారం కోసమే ఎదురుచూసే పోలీసులు ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చి అక్కడున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేసి తీసుకెళ్ళిపోయారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళ మీద భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 504, 506 - శాంతికి భంగం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లు 3, 5 , ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం, 2021 కింద కేసు నమోదు చేసి ఎఫ్ ఐ ఆర్ రాసిపడేశారు పోలీసులు.

ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం, 2021 కింద కేసు రుజువైతే బలవంతపు మతమార్పిడులకు కనీసం రూ.15,000 జరిమానాతో పాటు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన మైనర్లను, మహిళలను మతమార్పిడి చేస్తే మూడు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధించబడుతుంది.

కాగా ప్రస్తుతం అరెస్టయిన ఆరుగురు మహిళలు ఇంద్ర కాలా, సుభాగి దేవి, సాధన, సవిత, అనిత, సునీత లు బెయిల్ కూడా రాక జైల్లో మగ్గుతున్నారు.

దీనిపై పోలీసులకు పిర్యాదు చేసిన వీహెచ్‌పీ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అశుతోష్‌ సింగ్ మాట్లాడుతూ... "పుట్టినరోజు వేడుకల ముసుగులో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని మాకు సమాచారం అందింది. మేము విషయాన్ని పోలీసులకుదృష్టికి తీసుకెళ్లాము వారు ఆ మహిళలను అరెస్టు చేశారు.

అక్కడ మహిళలు మాత్రమే ఉన్నారు. వారు డబ్బుతో ఇతరులను ఆకర్షించి, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, " అని అన్నాడు "యేసు చెప్పినట్లే వారు గాలిలో చేతులు ఎత్తి ప్రార్దనలు చేశారు. వారు దళిత‌ మహిళలను మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ బర్త్ డే పార్టీ లాంటిదేమీ లేదు.'' అని సింగ్ ఆరోపించారు.

పేద సామాజిక-ఆర్థిక వర్గాలకు చెందిన మహిళలను, పురుషులను బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఆ మహిళలు ప్రయత్నిస్తున్నారని సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వేడుకను ఆపేందుకు ప్రయత్నించినప్పుడు తనను బెదిరించి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు సింగ్.

అయితే రాజకీయ లబ్ధి కోసం హిందూత్వ సంస్థ ఈ విదమైన ఆరోపణలు చేస్తున్నదని అరెస్టైన మహిళల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు అంటున్నారు. పుట్టిన రోజు వేడుకలను మతమార్పిడుల కార్యక్రమంగా చిత్రీకరించారని ఆరోపించారు.

అరెస్టు తరువాత, మహిళలను ప్రత్యేక దిగువ కోర్టు ముందు హాజరుపరిచారు. అభియోగాల తీవ్రత వల్ల వారికి బెయిల్ నిరాకరించబడింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 16న జరగనుంది.

విచారణ సందర్భంగా మహిళలతో పాటు వచ్చిన సామాజిక కార్యకర్త దీనానాథ్ జైస్వర్ మాట్లాడుతూ, " ఆ రోజు జరిగింది మహేంద్ర కుమార్ కొడుకు పుట్టినరోజు వేడుక. కాబట్టి తెలిసిన వ్యక్తులు, స్నేహితులందరూ గుమిగూడారు. వారు యేసును నమ్ముతారు కాబట్టి వారు కేక్ కట్ చేసే ముందు ప్రార్థనలు చేశారు. బలవంతంగా మతమార్పిడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్కడికి వచ్చిన అమిత్ సింగ్ అనే యువకుడు పోలీసులను తీసుకొచ్చి వీరిని అరెస్టు చేయించారు. ఇప్పుడు ఆరుగురు దళిత-క్రిస్టియన్ మహిళలు జైలులో మగ్గుతున్నారు.'' అని పేర్కొన్నాడు.

మహిళల తరపు న్యాయవాది మునీష్ చంద్ర మాట్లాడుతూ, "గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే, బలవంతపు మతమార్పిడుల ఆరోపణ ముసుగులో, ప్రభుత్వం మద్దతు ఇస్తున్నమితవాద మతోన్మాద సంస్థలు ఒక మత ప్రజల మద్దతు పొందడం కోసం ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఇదంతా రాజకీయ లబ్ది పొందడం కోసమే ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని ఆరోపించారు.''

మేము ఆ మహిళలకు బెయిల్ కోసం ప్రయత్నించాము, కానీ బెయిల్ రాలేదు.రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే మహిళలకు బెయిల్ ఇవ్వలేదని భావిస్తున్నాం' అని చంద్ర అన్నారు.

"ఒక మహిళ వికలాంగురాలు, ఒక మహిళ కుమారులు వికలాంగులు, మిగిలిన వారి కుటుంబాలు చాలా బాధలు పడుతున్నాయి, ఎందుకంటే వారందరూ ఈ మహిళలపై ఆధారపడి ఉన్నారు," అన్నారాయన.

కాగా ఉత్తరప్రదేశ్ లో 2021లో, క్రైస్తవులపై 300కు పైగా కేసులు నమోదు అయ్యాయి, బలవంతంగా మతమార్పిడి చేశారని మితవాద హిందుత్వ గ్రూపులు చేసిన‌ ఆరోపణల ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలాంటి కేసులు అత్యధిక శాతం దళిత, గిరిజన వర్గాలకు చెందిన క్రైస్తవులపైనే జరిగాయని ఓ నిజనిర్ధారణ నివేదిక తేల్చి చెప్పింది.

Next Story