Telugu Global
National

న‌దిలో దూకినా వ‌ద‌ల్లేదు.. సినీ ఫక్కీలో సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్ట్‌

త‌మ అరెస్టు చేసేందుకు మఫ్టీలో వ‌చ్చిన పోలీసులను చూపించి, వీరు పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ అంటూ గ్రామంలో దుష్ప్ర‌చారం చేసేవారు. స్థానికులను తప్పుదోవ పట్టించి తాము తప్పించుకునేవారు.

న‌దిలో దూకినా వ‌ద‌ల్లేదు.. సినీ ఫక్కీలో సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్ట్‌
X

తమను వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలో దూకారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని బ‌రాక‌ర్ న‌దీ స‌మీపంలో గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉన్నవారు పోలీసులేనని, తమకోసమే వస్తున్నారని ప‌సిగ‌ట్టిన నిందితులు అమాంతం నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. పట్టువదలని పోలీసులు నదిలోకి దూకి వారిని వెంబడించి మొత్తానికి వారిని అదుపులోకి తీసుకున్నారు.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు సైబర్ నేరగాళ్లు యాప్‌ల ద్వారా నగ్న వీడియో కాల్స్ చేస్తూ, వాటిని స్క్రీన్‌షాట్‌లు తీసి, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవారు. అంతే కాదు పోషకాహార ట్రాకర్ యాప్ ద్వారా ప్రసూతి ప్రయోజనాల గురించి తప్పుడు వాగ్దానాలతో గర్భిణులను కూడా వారు లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తమపైన నిఘా పెట్టారనే అనుమానంతో సైబర్ నేరగాళ్లు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

త‌మ అరెస్టు చేసేందుకు మఫ్టీలో వ‌చ్చిన పోలీసులను చూపించి, వీరు పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ అంటూ గ్రామంలో దుష్ప్ర‌చారం చేసేవారు. స్థానికులను తప్పుదోవ పట్టించి తాము తప్పించుకునేవారు. అయితే ఈసారి మరింత అప్రమత్తమైన పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి.. ప‌క్కా స‌మాచారంతో బ‌రాక‌ర్ న‌దీ స‌మీపంలో ఉన్న నేర‌గాళ్ల‌ను వెంబ‌డించారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న‌వారు పోలీసులే అని గ‌మ‌నించి.. త‌ప్పించుకునేందుకు న‌దిలో దూకారు. అయినా పోలీసులు వారిని వ‌ద‌ల్లేదు. న‌దిలో దూకి మొత్తానికి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి రూ.8,29,600 నగదు, 12 మొబైల్ ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్‌కార్డులు, 12 పాస్‌బుక్‌లు, ఆరు చెక్‌బుక్‌లు, నాలుగు పాన్‌కార్డులు, రెండు ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

First Published:  11 Dec 2023 7:37 AM GMT
Next Story