Telugu Global
National

వీఐపీలు వస్తుంటే.. వీనుల విందైన సంగీతం

సైరన్ బదులు ఇకపై శ్రావ్యమైన భారతీయ సంగీతం వినిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

వీఐపీలు వస్తుంటే.. వీనుల విందైన సంగీతం
X

వీఐపీలు వస్తున్నారంటే భారీ కాన్వాయ్ సైరన్ మోగించుకుంటూ వస్తుంది. ఆమధ్య బుగ్గ లైట్లు ఉండేవి కానీ, వాటికి పరిమితులు విధించారు. ఇప్పుడు సైరన్ మాత్రం కామన్ గా వినిపిస్తుంది. అయితే ఈ సైరన్ బదులు ఇకపై శ్రావ్యమైన భారతీయ సంగీతం వినిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సైరన్ సౌండ్ ని శాశ్వతంగా వినపడకుండా చేస్తామన్నారాయన.

పిల్లనగ్రోవి

తబల

వయోలిన్

శంఖం

ఇలాంటి భారతీయ వాద్య పరికరాల ద్వారా వచ్చే ధ్వనులతో కొత్త సైరన్ ని రూపొందిస్తామన్నారు మంత్రి గడ్కరీ. శబ్ద కాలుష్యాన్ని నివారించడంతో ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారాయన. గతంలో రెడ్ లైట్ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం కూడా తనకే లభించిందని, ఇప్పుడు సైరన్ ని తొలగించే అవకాశం కూడా తనకే దక్కుతోందని చెప్పారు గడ్కరీ.


సైరన్ దుర్వినియోగం కాకుండా..

మంత్రులు, వీఐపీల కార్లకు ఉపయోగించే సైరన్ ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునేందుకు చోటా మోటా లీడర్లు కూడా తమ కార్లకు సైరన్లు పెట్టుకుంటున్నారు. ఇకపై ఇలాంటి వాటిపై కూడా దృష్టిపెడతామన్నారు మంత్రి గడ్కరీ. ఒకవేళ సైరన్ దుర్వినియోగం అయినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సైరన్ సౌండ్ నే మార్చేస్తున్నామని చెప్పారు. శ్రావ్యమైన భారతీయ సంగీత పరికరాల శబ్దాలను వినిపిస్తామని హామీ ఇచ్చారు గడ్కరీ.

First Published:  13 Aug 2023 2:50 PM GMT
Next Story