Telugu Global
National

బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరంలో నెల‌కో బాల్య వివాహం

బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరంలో కూడా నెల‌కో బాల్య వివాహం జరుగుతోంది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి పెరుగుతోంది.

బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరంలో నెల‌కో బాల్య వివాహం
X

భారత దేశంలో బాల్య వివాహాలు ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు చేసినా ప్రజలు మాత్ర‍ం వెనక్కి తగ్గడం లేదు. చట్టాలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల పట్ల‌ ప్రజల్లో అవగాహన కలిగించడంలో విఫలమవుతున్నాయి. దాంతో మహానగరాల్లో సైతం బాల్యవివాహాలు ఆగడంలేదు. బెంగళూరు వంటి మహానగరంలో యావరేజ్ గా నెల‌కో బాల్య వివాహం జరుగుతోందని డాటా చెప్తోంది.

2022లోనే ఆగస్టు వరకు బాల్య వివాహాలపై 51 ఫిర్యాదులు రాగా వాటిలో 42 మాత్రమే అధికారులు ఆపగలిగారు. ఈ కాలంలో అధికారులు కనీసం 84%బాల్య వివాహాలను అడ్డుకోగలిగినప్పటికీ, బెంగళూరు అర్బన్, రూరల్ కలిపి ప్రతి నెలా ఒకటి కన్నా ఎక్కువ బాల్య వివాహాలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయని డేటా చెబుతోంది.

మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం 2020 , ఆగస్టు 2022 మధ్య బెంగళూరులో మొత్తం 47 బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహాలకు సంబంధించి 279 ఫిర్యాదులు రాగా 232 వివాహాలను అధికారులు ఆపగలిగారు. 2021-22లో కర్ణాటకలో మొత్తం 418 బాల్య వివాహాలు జరిగాయి, ఇది 2017-18తో పోలిస్తే 300% పెరిగిందని ఒక నివేదిక పేర్కొంది. కర్నాటకలో బాల్య వివాహాలు పెరగడానికి కారణాలలో ఒకటి COVID-19 మహమ్మారి. గ్లోబల్ కన్సర్న్స్ ఇండియాకు చెందిన బాలల హక్కుల కార్యకర్త 'బృందా అడిగే' ఈ విషయంపై మాట్లాడుతూ, తల్లితండ్రులు ఉద్యోగాలు కోల్పోవడం, COVID-19 కారణంగా కొందరు పిల్లలు తల్లినో, తండ్రినో లేక ఇద్దరినో కోల్పోవడం బాల్య వివాహాల పెరుగుదలకు కొన్ని కారణాలు అని చెప్పారు.

"తల్లిదండ్రులు ఉద్యోగాలు పోగొట్టుకున్నప్పుడు చాలా మంది పిల్లలు తమ ఆన్‌లైన్ తరగతులను కొనసాగించడానికి పాఠశాల ఫీజు చెల్లించలేకపోయారు, దీని ఫలితంగా చాలా మంది పిల్లలు బడి మానేశారు. కుటుంబాన్ని పోషించడానికి పని చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, మహమ్మారి బారిన పడినప్పటి నుండి భారతదేశంలో 15 కోట్ల మంది పిల్లలు బడి మానేశారు. అని బృందా చెప్పారు.

పాఠశాలలు ప్రారంభమైన తర్వాత, అప్పటికే పనులు చేస్తున్న వారు పాఠశాలకు వెళ్లకుండా పనిని కొనసాగించారు. "దీనివల్ల‌ పనిలో అమ్మాయి భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన పెరిగింది. ఒక వేళ ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటే, అది కూడా వారికి మరో భారంగా మారింది. తల్లితండ్రులు ఆమెను ఒక బరువుగా భావించి, ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు, వివాహం వారి కుమార్తెలకు స్థిరమైన భవిష్యత్తునిస్తుందని వారు అనుకుంటారు'' అని బృందా పేర్కొన్నారు.

COVID-19 పరిమితులు అమలులో ఉన్నందున, తక్కువ మందితో, తక్కువ‌ ఖర్చుతో వివాహాలు జరిగాయి. దాంతో తల్లితండ్రులు కూడా తమ కుమార్తెలకు త్వరగా వివాహం చేయడానికి ప్రయత్నించారు. బాల్య వివాహాలు జరిగినప్పుడు అధికారులకు ఉప్పందించేది పెళ్లి చేసుకునే అమ్మాయిస్నేహితులు, ఇరుగుపొరుగువారు, పాఠశాల సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు. అయితే కరోనా కారణంగా పాఠశాలలు, అంగన్‌వాడీలు మూసివేయబడ్డాయి. ఇరుగు పొరుగు ప్రజలు ఇల్లు దాటి బైటికి రావడానికే ఇష్టపడలేదు. దాంతో అధికారులకు సమాచారం అందలేదు.

ఇతర మతాలతో పోలిస్తే హిందూ కుటుంబాల్లో బాల్య వివాహాల కేసులు ఎక్కువగా ఉన్నాయని, చాలా వరకు వివాహాలు నమోదు కాలేదని బృందా చెప్పారు. పెళ్ళి నిర్వహించే పూజారులు కూడా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు స్థానిక అధికారులకు తెలియజేయడం లేదు.

తమ‌ జోక్యంతో వివాహం ఆగిపోయిన 14 ఏళ్ల బాలిక కేసును బృందా ఉదహరించారు. చదువులో రాణిస్తున్న బాలికకు కుటుంబ సభ్యులు 28 ఏళ్ల యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారు. బృందా, ఆమె బృందం జోక్యం చేసుకున్నప్పుడు, వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, అమ్మాయి ఇకపై చదువు కొనసాగించడానికి ఇష్టపడడటం లేదని తల్లితండ్రులు వీరికి చెప్పారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి బాలికను బాలల గృహానికి తరలించారు, అక్కడ ఆమె మూడు వారాల పాటు ఉంది. . అయితే, తిరిగి ఇంటికి వెళ్లిన బాలిక కొద్ది రోజులకే బృందా దగ్గరికి తిరిగి వచ్చేసింది. తాను పెళ్ళి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తన తల్లి తనను బెదిరిస్తోందని ఆ బాలిక కార్యకర్తలకు చెప్పింది.

అధికారులు ఆ బాలిక‌ కుటుంబానికి కానీ పెళ్ళి చేసుకున్న‌ వ్యక్తికి గానీ ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వలేదు. పైగా బాలికను తన దారిన తనను వదిలేశారు. దాంతో బృందా, బాలికను వేరే పాఠశాలకు బదిలీ చేయాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని అభ్యర్థించింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటోంది. ఆ బాలిక 10వ తరగతి పరీక్షలో 84% స్కోర్ చేసి ఇప్పుడు కాలేజీలో చదువుతోంది. తమ మాట వినకపోవడంతో ఆ బాలిక కుటుంబం ఆమెతో సంబంధాలు తెంచుకుంది.

బాల్యవివాహం జరిగినా లేదా జరగబోతోందని సమాచారం అందినా పోలీసులు, అధికారులు స్వయంగా ఫిర్యాదు చేయాలి. అయితే, పోలీసులు గానీ బాలల సంరక్షణ అధికారులు కానీ పిర్యాదు చేయరు. తమకేమీ తెలియనట్టు తప్పించుకుంటారు. ఎందుకంటే తర్వాత వారు సుదీర్ఘమైన కోర్టు ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది.

డేటా ప్రకారం, 2020 నుండి ఆగస్టు 2022 వరకు బాల్యవివాహాలపై 44 ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదయ్యాయి. "ఒక కేసు కోర్టులో తేలడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. పోలీసులు, పిల్లల రక్షణ విభాగం వారు కోర్టుల చుట్టూ తిరగడానికి ఇష్టపడనందున కేసుల దాకా రానివ్వకుండా ప్రయత్నిస్తారు. "అని బృందా ఆరోపించింది

First Published:  19 Oct 2022 10:40 AM GMT
Next Story