Telugu Global
National

ఇక్కడ షీ టీమ్స్.. అక్కడ పోలీస్ అక్కలు

తమిళనాడు ప్రభుత్వం కూడా షీ టీమ్స్ తరహాలో పోలీస్ అక్క పేరుతో ఓ ప్రయోగం చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 18నుంచి అందుబాటులోకి వచ్చిన పోలీస్ అక్క సేవలు సూపర్ అంటూ తమిళనాడు విద్యార్థినులు చెబుతున్నారు.

ఇక్కడ షీ టీమ్స్.. అక్కడ పోలీస్ అక్కలు
X

మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం దిశ యాప్ ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరి మొబైల్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేస్తున్నారు కానీ యాప్ పనితీరు విషయంలో మాత్రం ప్రభుత్వానికి పాస్ మార్క్ లు కూడా రావడంలేదనే అపవాదు ఉంది. ఇక తెలంగాణలో షీ టీమ్స్ పూర్తిగా సక్సెస్ అయ్యాయి. రోడ్లపైనే కాదు, కాలేజీ క్యాంపస్ లలో కూడా ఎక్కడా ఎవరూ ఇబ్బంది పడకుండా షీ టీమ్స్ విద్యార్థినులకు రక్షణగా నిలుస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా షీ టీమ్స్ తరహాలో పోలీస్ అక్క పేరుతో ఓ ప్రయోగం చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 18నుంచి అందుబాటులోకి వచ్చిన పోలీస్ అక్క సేవలు సూపర్ అంటూ తమిళనాడు విద్యార్థినులు చెబుతున్నారు.

ఆడ పిల్లలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేరు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వారు తటపటాయిస్తారు. కనీసం తల్లిదండ్రులయినా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లరు. పదిమందిలో చులకన అవుతామనే భయం అందరిదీ. అందుకే ఇలాంటి మౌన రోదనలకు పోలీస్ అక్కలు పరిష్కారం చెబుతున్నారు. మహిళా పోలీస్ లు తామే సివిల్ డ్రస్ లో కాలేజీలకు వెళ్తారు. అక్కడి విద్యార్థినులతో కలసిపోయు వారికి ధైర్యం చెబుతారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ఎస్ఓఎస్ యాప్ విద్యార్థినుల ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తారు. వారికి తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ కూడా ఇస్తారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తమకు ఫోన్ చేయొచ్చని భరోసా ఇస్తారు.

కోయంబత్తూర్ లో ఈ ప్రయోగం విజయవంతమైంది. పోలీస్ అక్కలు కాలేజీలకు వెళ్తున్న తర్వాత ఆకతాయిల ఆగడాలు తక్కువ అయ్యాయని చెబుతున్నారు. అమ్మాయిలు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీస్ అక్కలు రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో చాలామంది పోకిరీలు భయపడిపోయారు. కోయంబత్తూర్ లోని 61 కాలేజీల్లో ర్యాగింగ్ లాంటి సంఘటనలు కూడా తగ్గిపోయాయి.

శిక్ష కాదు, మార్పు ముఖ్యం..

పోకిరీలు అల్లరి చేశారంటే వెంటనే అక్కడకు వచ్చేసే పోలీస్ అక్కలు కుర్రాళ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. కానీ వారికి శిక్షలు వేయడం తమ కర్తవ్యం కాదని వారు చెబుతున్నారు. వారిలో మార్పుకోసమే తాము ప్రయత్నిస్తామన్నారు. పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారే అమ్మాయిలకు రక్షణగా ఉండేలా చూస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో వారి ఆడపిల్లలపై కక్ష పెంచుకోకుండా ఉంటారని చెబుతున్నారు పోలీసులు. మొత్తమ్మీద తెలంగాణలో షీ టీమ్స్ తరహా వ్యవస్థ ఇప్పుడు తమిళనాడులో కూడా సక్సెస్ కావడం విశేషం.

First Published:  2 Nov 2022 3:58 AM GMT
Next Story