Telugu Global
National

పిల్లల్ని కనండి.. సెలవులిస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం.. సిక్కిం సీఎం బంపర్ ఆఫర్లు

ప్రభుత్వ ఉద్యోగులే కాదు సాధారణ ప్రజలు కూడా ఎక్కువమంది పిల్లల్ని కంటే వారికి ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం తెలిపారు.

పిల్లల్ని కనండి.. సెలవులిస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం.. సిక్కిం సీఎం బంపర్ ఆఫర్లు
X

పిల్లల్ని కనే మహిళలకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తున్నారు. పిల్లలు కనే మహిళలకు ఏడాది పాటు సెలవులు ఇస్తామని, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే చైనా జనాభాను కూడా దేశ జనాభా దాటి ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. దేశంలో ఈ విధంగా జనాభా పెరుగుతుంటే సిక్కిం రాష్ట్రంలో మాత్రం జనాభా పెరుగుదల రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర జనాభా 7 లక్షలు మాత్రమే. అక్కడ సంతానోత్పత్తి రేటు 1.1శాతం మాత్రమే. దీంతో జనాభాను వృద్ధి చేసుకునేందుకు సిక్కిం ప్రభుత్వం కొంతకాలంగా చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా పిల్లలను కనే దంపతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ పిల్లలకు జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. వారికి మాతృత్వపు సెలవులను ఏడాదికి పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే ఏడాది పాటు పిల్లల బాగోగులను చూసుకునేందుకు ఇంటి వద్దే ఆయాలను కూడా ప్రభుత్వమే నియమిస్తుందని చెప్పారు. అంతేకాదు వారికి ప్రభుత్వమే పది వేల జీతం అందిస్తుందన్నారు.

ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులే కాదు సాధారణ ప్రజలు కూడా ఎక్కువమంది పిల్లల్ని కంటే వారికి ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం తెలిపారు. పిల్లలు కలగని వారి కోసం ప్రభుత్వమే ఐవీఎఫ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ కేంద్రాల ద్వారా సంతానం పొందిన దంపతులకు మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు.

First Published:  22 Jan 2023 6:12 AM GMT
Next Story