Telugu Global
National

బెట్టింగులో రూ.1.5 కోట్లు గెలిచిన ఎస్సై.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

మహారాష్ట్రలోని పింప్రి-ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఎస్ఐ సోమ్‌నాథ్ ఈ నెల 10న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా డ్రీమ్11లో బెట్టింగ్ పెట్టాడు.

బెట్టింగులో రూ.1.5 కోట్లు గెలిచిన ఎస్సై.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
X

ప్రస్తుతం ఇండియా వేదికగా ప్రపంచ కప్ జరుగుతోంది. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో బెట్టింగులు కూడా సహజమే. అయితే అనధికార బెట్టింగులు కాకుండా.. డ్రీమ్11 అనే యాప్‌లో ఫాంటసీ గేమ్ ద్వారా కూడా అధికారికంగా బెట్టింగులు జరిపే అవకాశం ఉన్నది. డ్రీమ్11లో ప్రతీ మ్యాచ్‌కు ముందు ఒక టీమ్‌ను తయారు చేసుకొని.. అందులోని ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ద్వారా భారీగా డబ్బులు గెలుచుకునే అవకాశం ఉన్నది. ఒక ఎస్సై కూడా డ్రీమ్11లో ఇలాంటి బెట్టింగులే చేసి రూ.1.5 కోట్లు గెలిచాడు. కానీ ఆ తర్వాత ఉన్నతాధికారులు అతనికి షాక్ ఇచ్చారు.

మహారాష్ట్రలోని పింప్రి-ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఎస్ఐ సోమ్‌నాథ్ ఈ నెల 10న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా డ్రీమ్11లో బెట్టింగ్ పెట్టాడు. డ్రీమ్11లో మూడు నెలల ముందే ఖాతా తెరిచిన సోమ్‌నాథ్.. మ్యాచ్ జరిగిన ప్రతీసారి బెట్టింగ్స్ వేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ రోజు ఉత్తమ ఆటగాళ్లతో టీమ్ ఎంపిక చేశాడు. ఆ రోజు ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి ఏకంగా రూ.1.5 కోట్లు గెలిచాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. స్వీట్లు పంచుకొని విషయాన్ని అందరికీ చెప్పాడు.

అయితే డ్రీమ్11లో ఎస్సై బెట్టింగ్‌కు పాల్పడిన విషయం ఉన్నతాధికారులకు చేరింది. నిబంధనలు అతిక్రమించి బెట్టింగ్‌లలో పాల్గొన్నందుకు అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్ మానే తెలిపారు. అక్టోబర్ 10న విధుల్లో ఉన్న సమయంలోనే బెట్టింగ్ చేసినట్లు విచారణలో తేలిందని ఏసీపీ చెప్పారు. సర్వీస్ రూల్స్‌కు ఇది విరుద్దమని. బెట్టింగ్‌లను అరికట్టాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు దిగడం తగదని సతీశ్ మానే చెప్పారు.

First Published:  19 Oct 2023 2:55 AM GMT
Next Story