Telugu Global
National

భారత సైన్యంలో సిపాయిల కొరత.. 1.35లక్షల ఖాళీలు

అత్యథికంగా ఆర్మీలో 1.18 లక్షల ఖాళీలున్నాయి. నావికా దళంలో 11,587 మంది సిబ్బంది కొరత ఉండగా, వాయుసేనలో ఖాళీగా ఉన్న పోస్ట్ ల సంఖ్య 5,819 గా తేలింది.

Indian Army Recruitment 2022
X

భారత సైన్యంలో సిపాయిల కొరత.. 1.35లక్షల ఖాళీలు

రక్షణ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, తాము అధికారం చేపట్టాక బడ్జెట్ పెంచామని, అధునాత ఆయుధాలు సమకూర్చామని గొప్పలు చెప్పుకుంటుంది బీజేపీ ప్రభుత్వం. కానీ ఈ గొప్పలన్నీ కేవలం ప్రచార ఆర్భాటమేనని, అసలు సంగతి వేరే ఉందని తేలిపోయింది. అవును అధునాతన ఆయుధాలున్నా వాటిని ప్రయోగించే మానవ వనరుల విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సైన్యంలో ఉద్యోగాల భర్తీ నిలిచిపోవడంతో ఏడాదికేడాది పోస్ట్ లు ఖాళీగానే ఉండిపోతున్నాయి. భారత సైన్యంలో ప్రస్తుతం 1.35 లక్షల సిబ్బంది కొరత ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్.. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అత్యథికంగా ఆర్మీలో 1.18 లక్షల ఖాళీలున్నాయి. నావికా దళంలో 11,587 మంది సిబ్బంది కొరత ఉండగా, వాయుసేనలో ఖాళీగా ఉన్న పోస్ట్ ల సంఖ్య 5,819 గా తేలింది.

కరోనాపై నెపం..

సైన్యంలో ఖాళీలు భర్తీ చేయకుండా వదిలేసిన కేంద్రం ఆ నెపాన్ని కరోనాపై నెట్టేసింది. ప్రతి ఏడాది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో సగటున 60,000 ఖాళీలు ఏర్పడుతున్నాయని, వీటిలో దాదాపు 50,000 ఖాళీలు కేవలం ఆర్మీలోనే ఉంటాయని చెప్పారు మంత్రి అజయ్ భట్. కరోనా వల్ల రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలు ఆపేశామని చెబుతున్న ఆయన, ప్రస్తుతం భారత ఆర్మీలో 1,08,685 మంది జవాన్ల కొరత ఉందని చెప్పారు.

ఇక అంతా అగ్నిపథమే..

ఇప్పుడు కరోనా పరిస్థితులు చక్కబడటంతో రిక్రూట్ మెంట్ లు ప్రారంభమయ్యాయని, రాబోయే సంవత్సరాల్లో ఈ ఖాళీలు తగ్గుతాయని అంటున్నారు. ప్రస్తుతం సైన్యంలో 40,000 ఖాళీల్లో అగ్నివీర్ లను భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. నేవీలో ఈ ఏడాది 3వేలమంది అగ్నివీర్ లను చేర్చుకుంటామని, వైమానిక దళంలో మరో 3వేలమంది అగ్నివీర్ లకు అపాయింట్ మెంట్ ఇస్తామన్నారు మంత్రి అజయ్ భట్.

First Published:  11 Dec 2022 6:03 AM GMT
Next Story