Telugu Global
National

బీజేపీ కూటమి ఎన్డీయేకు షాక్

1956లో అన్నాదురై హిందూ మతాన్ని అవమానించారని అన్నామలై ఆరోపించారు. దీనిపై అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీజేపీ కూటమి ఎన్డీయేకు షాక్
X

కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)కు పెద్ద ఎదురు దెబ్బ తగలింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న ఆల్ ఇండియా అన్నా డీఎంకే (ఏఐఏడీఎంకే) బయటకు వచ్చేసింది. ఇకపై ఎన్డీయే, బీజేపీతో ఎలాంటి స్నేహం ఉండబోదని పార్టీ ప్రకటించింది. ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై.. మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడజాతి ఐకాన్ సీఎన్ అన్నాదురైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1956లో అన్నాదురై హిందూ మతాన్ని అవమానించారని అన్నామలై ఆరోపించారు. దీనిపై అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతేడాదిగా మా మాజీ నేతలను, పార్టీ ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌తో పాటు పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నోసార్లు హెచ్చరించినా తమ వైఖరిని మార్చుకోలేదు. అందుకే ఈ రోజు జరిగిన సమావేశంలో బీజేపీ, ఎన్టీయేతో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని తీర్మానించాము. దీనికి పార్టీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి మీడియాకు తెలిపారు.

కొంత కాలంగా తమిళనాడులోని బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పలు అంశాల్లో తీవ్ర స్థాయి విభేదాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతోనే ఏఐఏడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఈ ప్రకటన చేయగానే ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. కాగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు.


First Published:  25 Sep 2023 1:00 PM GMT
Next Story