Telugu Global
National

సింగర్ సోనూ నిగమ్ పై శివసేన ఎమ్మెల్యే కుమారుడి దాడి

ఈ ఘటనలో సోనూ స్నేహితుల్లో ఒకరు గాయపడ్డాడు. సోనూకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. సోనూ ఆయన స్నేహితుడిని చికిత్స కోసం చెంబూర్ లోని ఆసుపత్రికి తరలించారు.

సింగర్ సోనూ నిగమ్ పై శివసేన ఎమ్మెల్యే కుమారుడి దాడి
X

ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన, ఆయన స్నేహితులపై శివసేన ఎమ్మెల్యే కుమారుడు దాడికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 20వ తేదీన ముంబైలోని చెంబూర్ లో సోనూ నిగమ్ తన బృందంతో కలసి ఓ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వేదికపై నుంచి సోనూ మెట్లు దిగుతుండగా శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ ఫాటర్ పేకర్ కుమారుడు స్వప్నిల్ ఫాటర్ పేకర్ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అందుకు సోనూ సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన స్వప్నిల్ సోనూ, అతడి స్నేహితులు ఇద్దరిని మెట్ల పైనుంచి కిందకు తోసేశాడు.

ఈ ఘటనలో సోనూ స్నేహితుల్లో ఒకరు గాయపడ్డాడు. సోనూకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. సోనూ ఆయన స్నేహితుడిని చికిత్స కోసం చెంబూర్ లోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై ముంబై పోలీస్ డీసీపీ హేమ్ రాజ్ సింగ్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. సోనూతో సెల్ఫీ దిగేందుకు స్వప్నిల్ ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో ఈ గొడవ జరిగినట్లు తెలిపారు.

సోనూ, అతడి స్నేహితులపై స్వప్నిల్ దాడికి పాల్పడినట్లు వివరించారు. గాయపడ్డ వ్యక్తిని రబ్బానీగా గుర్తించినట్లు వెల్లడించారు. సోనూ నిగమ్ చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 323, 341, 337 కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. కాగా, సోనూ నిగమ్, అతడి స్నేహితులపై ఎమ్మెల్యే కుమారుడు దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  21 Feb 2023 10:04 AM GMT
Next Story